కార్పొరేషన్ కార్యాలయం ముట్టడి
కడప కార్పొరేషన్ : మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ (సీఐటీయూ అనుబంధం) కడప నగర కమిటీ ఆధ్వర్యంలో గురువారం కడప మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ సందర్భంగా నగర అధ్యక్షుడు ఎస్. కిరణ్, నగర కార్యదర్శి సుబ్బయ్య, చంద్రారెడ్డి మాట్లాడుతూ కార్మికులకు 60 ఏళ్ల వయసు వచ్చిందని చిల్లిగవ్వ కూడా ఇవ్వకుండా రిటైర్‌మెంట్ చేయడం దారుణమన్నారు. వారి కుటుంబలో ఒకరికి ఉద్యోగం ఇచ్చి, రూ.10 లక్షలు బెనిఫిట్లు, రూ.10వేలు పింఛన్ ఇవ్వాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి తమ సమస్యలను పరిష్కరించాలని కోరారు. అనంతరం మున్సిపల్ కార్మికులు బారికేడ్లను తోసుకుంటూ కార్యాలయంలోకి ప్రవేశించడానికి ప్రయత్నించగా, పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ దశలో పోలీసులు, కార్మిక నాయకుల మధ్య తీవ్ర తోపులాట, వాగ్వాదం చోటు చేసుకుంది. తోపులాటలో ఇద్దరు కార్మికులకు గాయాలయ్యాయి. ఈ సందర్భంగా కమిషనర్ మనోజ్‌రెడ్డి దీక్షా శిబిరం వద్దకు వచ్చి కార్మికులతో మాట్లాడారు. రిటైర్ అయ్యే కార్మికుల కుటుంబంలో ఒకరికి అడిషనల్ వర్కర్‌గా ఉద్యోగం కల్పిస్తామని స్టాండింగ్ కమిటీలో తీర్మానం చేశారన్నారు.
ఇంజినీరింగ్ కార్మికులకు వేతనాలిచ్చే విషయమై మేయర్‌తో మాట్లాడతామన్నారు. మిగిలిన సమస్యలపై ఈనెల 9వ తేదీ కార్మికులతో కూర్చొని చర్చిస్తామన్నారు. దీక్ష చేస్తున్న వారికి మజ్జిగ ఇచ్చి విరమింపజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు కె. తిరుపాల్, నగర అధ్యక్షుడు ఎస్. రవి, నగర వర్కింగ్ ప్రెసిడెంట్ కె. శ్రీరామ్, ఇ. ప్రకాష్, డ్రైవర్స్ యూనియన్ అధ్యక్షుడు శ్రీధర్ బాబు, నాగరాజు, మస్తాన్, శీను, రాజు, హరి, పెంచలయ్య, నాగరాజు తదతరులు పాల్గొన్నారు.
పోలీసులు, కార్మికుల మధ్య తీవ్ర తోపులాట
ఇద్దరికి గాయాలు


