గాలి, వాన బీభత్సం
వేంపల్లె : ఒక్కసారిగా వాతావరణంలో మేఘాలు కమ్ముకొని వర్షంతోపాటు భారీ ఎత్తున గాలి వీచడంతో అరటి తోటలు నేలకూలాయి. దీంతో అరటి పంట సాగు చేసిన రైతులు లబోదిబోమంటున్నారు. బుధవారం రాత్రి ఉరుములు, మెరుపులతో కూడిన బలమైన గాలులతో వర్షం కురిసింది. దీంతో మండలంలోని వేంపల్లె, కుప్పాలపల్లె, నందిపల్లి, టి.వెలమవారిపల్లెలతోపాటు ఆయా గ్రామాల్లో సాగు చేసిన అరటి పంట వందల ఎకరాల్లో నేల కూలింది. పంట చేతికి వచ్చే సమయంలో గాలితో కూడిన వర్షం కురవడంతో అరటి చెట్లు కింద పడిపోయినట్లు రైతు ఈశ్వరరెడ్డి, రామగంగిరెడ్డి తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో నిమ్మ చెట్లు కూడా గాలికి కూకటి వేళ్లతో పైకి లేచినట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అరటి పంటకు ఎకరాకు రూ .2లక్షల పైచిలుకు పెట్టుబడి పెట్టి సాగు చేసినట్లు రైతులు తెలిపారు. ఒక వైపు ధరలు పడి పోవడంతో పాటు మరో వైపు ప్రకృతి కరుణించకపోవడంతో రైతులకు నష్టం కలిగిందని తెలిపారు. 5 ఎకరాల పొలం కౌలుకు తీసుకొని రూ.15లక్షలు ఖర్చు చేసి వేంపల్లె పొలంలో అరటి సాగు చేసినట్లు కౌలు రైతు ఈశ్వరరెడ్డి తెలిపారు. అరటి పంట కోతకు వచ్చే దశలో భారీగా గాలి వీచడంతో కాయలు గల అరటి చెట్లు కిందపడి పోయినట్లు రైతు రమణారెడ్డి చెప్పారు. అకాల వర్షంతో తీవ్రమైన పంటకు నష్టం వాటిల్లింది. అలాగే పలు చోట్ల చెట్లు విరిగి పడడంతోపాటు మామిడి కాయలు రాలి పోయాయి. అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులకు ప్రభుత్వం పరిహారం ఇచ్చి ఆదుకోవాలని పలువురు రైతులు కోరుతున్నారు.
నేలకూలిన అరటి
లబోదిబోమంటున్న రైతులు
గాలి, వాన బీభత్సం


