ధ్వజారోహణంతో పుష్పగిరి బ్రహ్మోత్సవాలు ప్రారంభం
వల్లూరు : పవిత్ర పుణ్య క్షేత్రమైన పుష్పగిరిలోని శ్రీ కామాక్షీ వైద్యనాఽథేశ్వర స్వామి ,శ్రీ లక్ష్మీ చెన్న కేశవ స్వాముల బ్రహ్మోత్సవాలు శనివారం రెండు ఆలయాల్లో నిర్వహించిన ధ్వజారోహణం కార్యక్రమంతో ఘనంగా ప్రారంభమయ్యాయి. వైద్యనాథేశ్వర స్వామి ఆలయంలో అర్చకులు శ్రీనివాస మూర్తి ఆధ్వర్యంలో ఉదయం గణపతి పూజ నిర్వహించారు. నందీశ్వరుని చిత్ర పటాన్ని ధ్వజ స్తంభంపై అధిష్టింప జేశారు. రాత్రి హంస వాహనంపై శ్రీ కామాక్షీ వైధ్యనాథ స్వామి భక్తులకు దర్శనమిచ్చారు. పూజల అనంతరం దివిటీల వెలుగులు, మంగళ వాయిద్యాల మధ్య మాడ వీధుల్లో స్వామి వారి గ్రామోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
● కొండపైన గల శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయంలో తెల్లవారు జామున సుప్రభాత సేవ జరిగింది. అనంతరం ప్రధాన అర్చకుల ఆధ్వర్యంలో విశ్వక్సేన పూజ నిర్వహించారు. అనంతరం రాత్రి ధ్వజారోహణ కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలతో ప్రారంభించి గరుడుని చిత్ర పటాన్ని ధ్వజ స్తంభంపై అధిష్టింప చేశారు. అనంతరం కొండపై నుండి స్వామి వారిని తిరుచ్చి వాహనంలో మోస్తూ గ్రామ మాడ వీధు ల్లో గ్రామోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్త దుగ్గిరెడ్డి వెంకట సుబ్బారెడ్డి పాల్గొన్నారు.


