ఉద్దేశ పూర్వకంగానే డీఎస్పీపై ఎమ్మెల్యే వరద ఆరోపణలు
మాజీ ఎమ్మెల్యే
రాచమల్లు శివప్రసాదరెడ్డి
ప్రొద్దుటూరు : ఎలాంటి తప్పు చేయకుండా, ఆధారం లేకుండానే అధికార పార్టీ నేతలపై పోలీసులు కేసులు పెట్టే పరిస్థితులు ఈ రోజుల్లో ఉన్నాయా అని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాదరెడ్డి ప్రశ్నించారు. కాశీ నుంచి మంగళవారం లైవ్ ద్వారా మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాచమల్లు మాట్లాడుతూ కేవలం ఉద్దేశ పూర్వకంగానే పోలీసులు, రెవెన్యూ అధికారులపై ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి విమర్శలు చేస్తున్నారన్నారు. తన మాట వినని అధికారులపై లంచగొండి అనే ట్యాగ్ వేయడం ఆయనకే చెల్లునన్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉండి ఆయన అధికారులు లంచగొండులు అని, అసమర్థులని, అవినీతిపరులని మాట్లాడటాన్ని బట్టి ప్రభుత్వం పరిస్థితి ఏవిధంగా ఉందో అర్థమవుతోందన్నారు. కేవలం తన అనుచరుడు దొరసానిపల్లె సర్పంచ్ భర్త మునివరపై క్రికెట్ బుకీ కేసు నమోదు చేసినందుకే ఆయన డీఎస్పీని అవినీతి పరురాలిగా చిత్రీకరించారన్నారు. డీఎస్పీతోపాటు పోలీసులు మద్యం షాపుల నుంచి నెల మామూళ్లు వసూలు చేస్తున్నారని ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి ఆరోపించడంలో అర్థం లేదని మాజీ ఎమ్మెల్యే రాచమల్లు తెలిపారు. 30 ఏళ్లకుపైగా అటు ఎకై ్సజ్ అధికారులు, ఇటు పోలీసులు మామూళ్లు తీసుకోవడం ఆనవాయితీ అయిందన్నారు. ఇటీవల టీడీపీ కార్యక్రమం నిర్వహణ కోసం మద్యం షాపుల యజమానుల నుంచి రూ.10లక్షలు అడిగిన మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు.


