వైద్య మిత్రల బంద్‌.. రోగులకు ఇబ్బందులు | - | Sakshi
Sakshi News home page

వైద్య మిత్రల బంద్‌.. రోగులకు ఇబ్బందులు

Mar 25 2025 1:32 AM | Updated on Mar 25 2025 1:30 AM

కడప రూరల్‌ : డాక్టర్‌ ఎన్టీఆర్‌ వైద్య సేవలో పనిచేస్తున్న వైద్య మిత్రలు, ఇతర సిబ్బంది తమ సమస్యల పరిష్కారం కోసం సోమవారం విధులను బహిష్కరించారు. స్ధానిక ఆ సంస్థ జిల్లా కో ఆర్డినేటర్‌ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. వైద్య మిత్రలు విధులను బహిష్కరించడంతో ఉచిత వైద్యం కోసం నెట్‌వర్క్‌ ఆసుపత్రులకు వచ్చిన నిరుపేద రోగులు ఇబ్బందులు పడ్డారు.

‘వైద్యమిత్ర’లు లేక రోగుల అవస్ధలు..

జిల్లా వ్యాప్తంగా ‘వైద్య సేవ’ పరిధిలో మొత్తం 108 నెట్‌వర్క్‌ ఆసుపత్రులు ఉన్నాయి. ఈ ఆసుపత్రులకు ఒక రోజు దాదాపు 2 వేల మందికి పైగా వివిధ అనారోగ్య సమస్యలతో వస్తుంటారు. ఈ ఆసుపత్రుల్లో 105 మంది వైద్య మిత్రలు, ఐదుగురు టీఎల్‌ (టీమ్‌ లీడర్లు) పనిచేస్తున్నారు. ఆసుపత్రులకు వచ్చే రోగులు ముందుగా వైద్య మిత్రలను సంప్రదిస్తే, వారు ఆ వ్యక్తి వివరాలను పరిగణనలోకి తీసుకొని ఉచిత వైద్య సేవ కోసం రిజిస్ట్రేషన్‌ చేసి వైద్యుల వద్దకు తీసుకెళతారు. అక్కడ రోగిని డాక్టర్‌ పరీక్షించి వ్యాధిని నిర్ధారిస్తారు. అనంతరం సర్జరీ లాంటివి అవసరమైతే ఇన్‌ పేషెంట్‌గా అడ్మిట్‌ చేస్తారు. అవసరం లేకపోతే ఓపీ (ఔట్‌ పేషెంట్‌) కింద మందులు రాసిస్తారు. కాగా ఇన్‌ పేషెంట్‌గా చేరిన రోగి డిశ్చార్జ్‌ అయ్యే వరకు వారి బాధ్యతలను వైద్య మిత్రలు పర్యవేక్షిస్తారు. ఈ సిబ్బంది విధులను బహిష్కరించడంతో వైద్య మిత్రల ‘రోల్‌’ను ఆసుపత్రులకే అప్పగించారు. అయితే ఆసుపత్రుల వారు కొంత వరకు అత్యవసర కేసులను మాత్రమే తీసుకున్నారు. మిగతా వారిని పరీక్షించకుండా ఈ రోజు వైద్య సేవలు లేవు. ‘రేపు రండి’ అని చెప్పి పంపించేశారు. దీంతో అనారోగ్యం నుంచి కొంచైమెనా ఉపశమనం పొందుతామనే వారికి నిరాశ ఎదురైంది. ప్రధానంగా దూర ప్రాంతాల నుంచి వచ్చిన వ్యాధిగ్రస్తులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. కొంత మంది డాక్టర్‌కు ఫీజు చెల్లించి చూపించుకొని.. రాసిచ్చిన మందులు కొని వెళ్లారు. గత సోమవారం ఒక వారం క్రితం వైద్య మిత్రలు విధులను బహిష్కరించినప్పుడు కూడా పేదలు ఇబ్బందులు పడ్డారు. ఇంత జరుగుతున్నా టీడీపీ కూటమి ప్రభుత్వం ఏమా త్రం స్పందించలేదు. ఈ నేపథ్యంలో ఎప్పుడూ ఇలాంటి సమస్యలు ఎదురు కాలేదు. ఇప్పుడెందుకు మాకీ ఇబ్బందులు అని పేదలు ప్రశ్నిస్తున్నారు.

ఉద్యోగ భద్రత కల్పించాలి

డాక్టర్‌ ఎన్టీఆర్‌ వైద్య సేవ ట్రస్ట్‌లో పనిచేస్తున్న వైద్య మిత్రలు, ఇతర సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పించాలని సోమవారం స్థానిక ఆ సంస్థ కార్యాలయం ఎదుట ఆరోగ్యమిత్ర కాంట్రాక్ట్‌ అండ్‌ ఔట్‌ సోర్సింగ్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో విధులను బహిష్కరించి, నిరసన తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు విజయ్‌ మాట్లాడుతూ వైద్య సేవ విభాగంలో తామంతా కీలకమైన బాధ్యతలను నిర్వర్తిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో వెయిటేజీ కల్పించి తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. తమ సమస్యలను పరిష్కరించాలని పలు మార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా తమకు న్యాయం జరగలేదన్నారు. కార్యక్రమంలో నాగార్జున రెడ్డి, సుబ్బరాజు, కవిత, భవిత, నాగరత్న పాల్గొన్నారు.

‘డాక్టర్‌ ఎన్టీఆర్‌ వైద్య సేవ’

సిబ్బంది విధుల బహిష్కరణ

నిరుపేద రోగులకు తప్పని అవస్థలు

చాలా మంది వెనక్కి వెళ్లారు..

నాకు ఇది వరకే గుండె ఆపరేషన్‌ జరిగింది. చెకప్‌కు వచ్చాను. నన్ను డాక్టర్లు చెకప్‌ చేశారు. ఇక్కడికి చాలా మంది వచ్చారు. బంద్‌ అని చెప్పడంతో వారంతా వెళ్లిపోయారు. అలాగే గతంలో ఆరోగ్య శ్రీ కింద వైద్య సేవలు పొంది డిశ్చార్జ్‌ కాగానే ‘ఆసరా’ పథకం కింద కొంత డబ్బును ఇచ్చేవారు. ఇప్పుడు ఆ పథకం లేదంటున్నారు. ప్రభుత్వం ‘ఆసరా’ను ఇవ్వడంతో పాటు పేదల వైద్యానికి ఇబ్బందులు లేకుండా చూడాలి.

– వెంకటేష్‌, పులివెందుల

వైద్య సేవలు బంద్‌ అని చెప్పారు..

నరాల సమస్యతో బాధపడుతున్నాను. వైద్యం కోసం కడపకు వచ్చాను. ఈ రోజు వైద్య సేవలు లేవు బంద్‌, రేపు రమ్మని చెప్పారు వైద్య సేవలను నిలుపుదల చేస్తే మా లాంటి వారి పరిస్థితి ఏమి కావాలి.

– కొండయ్య, పోరుమామిళ్ల

వైద్య మిత్రల బంద్‌.. రోగులకు ఇబ్బందులు1
1/3

వైద్య మిత్రల బంద్‌.. రోగులకు ఇబ్బందులు

వైద్య మిత్రల బంద్‌.. రోగులకు ఇబ్బందులు2
2/3

వైద్య మిత్రల బంద్‌.. రోగులకు ఇబ్బందులు

వైద్య మిత్రల బంద్‌.. రోగులకు ఇబ్బందులు3
3/3

వైద్య మిత్రల బంద్‌.. రోగులకు ఇబ్బందులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement