కడప రూరల్/కడప కోటిరెడ్డి సర్కిల్: ఆడ పిల్లల శాతాన్ని పెంచేందుకు కృషి చేయడంతో పాటు లింగ వివక్షతను చూపే వారిపై కేసులు నమోదు చేయాలని రెవెన్యూ డివిజనల్ అధికారి పి. జాన్‌ఇర్విన్ అన్నారు. సోమవారం స్ధానిక డివిజనల్ అధికారి కార్యాలయంలో థామస్ మన్రో మీటింగ్ హాల్‌లో రెవెన్యూ డివిజనల్ అధికారి అధ్యక్షతన గర్భస్థ శిశు నిర్ధారణ పరీక్షల నిర్మూలనపై సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాలల లింగ నిష్పత్తిని గమనిస్తే బాలురతో పోలిస్తే బాలికల శాతం తక్కువగా ఉందన్నారు. అసమానతలు తొలగించి సమాజంలో ఆడపిల్లల శాతం పెంచాలని తెలిపారు. గర్భస్థ లింగ నిర్ధారణ పరీక్షలకు చట్టపరమైన శిక్ష ఉంటుదన్నారు. లింగ నిర్ధారణకు పాల్పడే స్కానింగ్ సెంటర్లు, వైద్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామన్నారు. నోడల్ అధికారి డాక్టర్ ఉమామహేశ్వరకుమార్ మాట్లాడుతూ ఆర్‌ఎంపీలు అబార్షన్‌లు చేయకూడదని, నిబంధనలు అతిక్రమిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో డాక్టర్ రబ్బాని, సీఐ బి. రామకృష్ణ, డాక్టర్ బాలకృష్ణ, టి.మెహన్‌కృష్ణ, భారతి, అధికారులు, ఎన్జీఓలు పాల్గొన్నారు.


