ఆప్కాస్‌ కార్మికులసమస్యలు పరిష్కరించాలి | - | Sakshi
Sakshi News home page

ఆప్కాస్‌ కార్మికులసమస్యలు పరిష్కరించాలి

Jun 15 2024 11:42 PM | Updated on Jun 15 2024 11:42 PM

ఆప్కా

ఆప్కాస్‌ కార్మికులసమస్యలు పరిష్కరించాలి

కడప అర్బన్‌ : రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ శాఖలలో ఆప్కాస్‌ విధానంలో పని చేస్తున్న కార్మికుల సమస్యలను పరిష్కరించాలని ఏపీ ఆప్కాస్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పి.వెంకటసుబ్బయ్య శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆప్కాస్‌ విధానంలో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు లక్ష 16 వేల మంది కార్మికులు విధులు నిర్వహిస్తున్నారన్నారు. వీరికి కనీస వేతనం అమలు చేయాలని కోరారు. కాంట్రాక్ట్‌ ఉద్యోగుల తరహాలోనే వీరిని పర్మినెంట్‌ చేయాలన్నారు. వీరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయాలని వివరించారు.

జనావాసంలోకి దేవాంగ పిల్లి

పీలేరు : అత్యంత అరుదుగా కనిపించే దేవాంగ పిల్లి స్థానిక ఎన్‌టీఆర్‌ కాలనీలో జనావాసంలోకి రావడంతో స్థానికులు గుర్తించారు. శనివారం ఎన్‌టీఆర్‌ కాలనీలో దేవాంగ పిల్లిని గుర్తించిన స్థానికులు పి.రామాంజులు, మౌనిక, రెడ్డిప్రసాద్‌ సమాచారాన్ని అటవీ శాఖ అధికారులకు తెలియజేశారు. అటవీ క్షేత్రాధికారి బి.రామ్లానాయక్‌ దేవాంగ పిల్లిని పరిశీలించి తమ సిబ్బందిచే తలపుల అటవీప్రాంతంలో వదలిపెట్టారు. ఈ కార్యక్రమంలో ఎఫ్‌ఎస్‌వో వేణు, సిబ్బంది పాల్గొన్నారు.

క్రమశిక్షణతో

విద్యను అభ్యసించాలి

కడప అర్బన్‌ : విద్య ఎంతో విలువైనదని, క్రమశిక్షణతో అభ్యసించాలని జిల్లా న్యాయసేవాధికారసంస్థ సెక్రటరీ, జడ్జి ఎస్‌.బాబా ఫకృద్దీన్‌ అన్నారు. శనివారం కడపలోని బాలుర వసతి గృహాన్ని జిల్లా న్యాయసేవాధికారసంస్థ ఆధ్వర్యంలో జడ్జి తమ సిబ్బందితో కలిసి పరిశీలించారు. పిల్లలు ఏ తరగతులను అభ్యసిస్తున్నారో అడిగి తెలుసుకున్నారు. తరగతి గదులు, వంటశాలను పరిశీలించారు. పిల్లలకు అందుతున్న భోజన సదుపాయాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ జాతీయ న్యాయసేవాధికారసంస్థ వారి బాలల సంరక్షణ కోసం స్నేహపూర్వక న్యాయసేవలు పథకం 2015ను వివరించారు. పరిసరాలను పరిశుభ్రంగా వుంచుకోవాలన్నారు. పిల్లల విద్యా, అరోగ్య విషయాల పట్ల తగిన జాగ్రత్తలు వహించాలని అధికారులను ఆదేశించారు. ఏవైనా సమస్యలుంటే జిల్లా న్యాయసేవాధికారసంస్థ, కడప వారి దృష్టికి తీసుకురావాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ బాలుర గృహం సూపరింటెండెంట్‌ వీరయ్య, ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు, వైద్యురాలు పాల్గొన్నారు.

ఆ చట్ట సవరణను

రద్దు చేయాలి

కడప వైఎస్‌ఆర్‌ సర్కిల్‌ : ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ను ప్రభుత్వం రద్దు చేయడం హర్షణీయమని సీపీఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర తెలిపారు. శనివారం నగరంలోని సీపీఐ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నిషేధిత భూముల 22ఏ చట్ట సవరణను కూడా రద్దు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కేసీ బాదుల్లా, నాయకులు లింగన్న, బ్రహ్మం తదితరులు పాల్గొన్నారు.

‘ఆ ఉద్యోగిపై

చర్యలు తీసుకోవాలి’

కడప కోటిరెడ్డిసర్కిల్‌ : వాణిజ్య పన్నుల శాఖలో ఉద్యోగిగా పని చేస్తూ సంఘ నాయకుడిలా చలామణి అవుతున్న కేఆర్‌ సూర్యనారాయణపై ఉన్న కేసులను క్షుణ్ణంగా పరిశీలించి తగిన చర్యలు చేపట్టడంతోపాటు ఇతని సంఘం గుర్తింపును రద్దు చేయాలని ది కమర్షియల్‌ ట్యాక్సెస్‌ నాన్‌ గెజిటెడ్‌ ఆఫీసర్స్‌ అసోసియేషన్‌ కడప డివిజన్‌ జిల్లా అధ్యక్షుడు ప్రవీణ్‌కుమార్‌ కోరారు. స్థానికంగా ఆయన శనివారం మాట్లాడుతూ గత ప్రభుత్వంలో కోట్లాది రూపాయల ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టిన అభియోగంపై శాఖాపరమైన నివేదిక ఆధారంగా ప్రభుత్వం సూర్యనారాయణపై సస్పెన్షన్‌ వేటు వేసిందన్నారు. అందుకు సహకరించిన ఇతర ఉద్యోగులను కూడా సస్పెండ్‌ చేసిందని, వారంతా జైలు పాలు కాగా, సూర్యనారాయణ అజ్ఞాతంలోకి వెళ్లి అరెస్టు కాకుండా స్టే తెచ్చుకున్నారన్నారు. అధికారులను బ్లాక్‌ మెయిల్‌ చేసేందుకు నూతన ముఖ్యమంత్రితో ఫొటోలు దిగి కొత్త డ్రామాలకు తెరతీస్తున్నారన్నారు. తన సంఘానికి ఓడీ సౌకర్యం లేకపోయినా ఇతర సంఘాలకు ఉన్న సౌకర్యాలను చట్టవిరుద్ధంగా పొందారని ఆరోపించారు. 2023లో సూర్యనారాయణ సంఘం సభ్యుల అక్రమాలపై.. విజయవాడలో వర్తకులు తమను వేధిస్తున్న విధానాలపై ఫిర్యాదు చేశారని గుర్తు చేశారు.

పాఠశాల వేళకు

బస్సు సౌకర్యం కల్పించాలి

గాలివీడు : తలముడిపి, కొర్లకుంట, పందికుంట గ్రామాల విద్యార్థులు నూలివీడు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలకు వెళ్లి చదుకోవడానికి బస్సు సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, పాఠశాల వేళకు బస్సు సర్వీసు ఏర్పాటు చేయాలని ఓల్డ్‌ స్టూడెంట్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు చంద్రశేఖర్‌ పేర్కొన్నారు. శనివారం రాయచోటి పట్టణంలోని జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో కలెక్టర్‌ అభిషిక్త్‌ కిషోర్‌ను ఆ అసోసియేషన్‌ నాయకులు కలిసి వినతిపత్రాన్ని సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఓల్డ్‌ స్టూడెంట్స్‌ అసోసియేషన్‌ ట్రెజరర్‌ నాగార్జున గుప్తా, సభ్యులు పాల్గొన్నారు.

ఆప్కాస్‌ కార్మికులసమస్యలు పరిష్కరించాలి  1
1/1

ఆప్కాస్‌ కార్మికులసమస్యలు పరిష్కరించాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement