
కౌంటింగ్‌కు పటిష్టంగా భద్రత
జిల్లా ఎన్నికల అధికారి విజయరామరాజు
కడప సెవెన్‌రోడ్స్: పటిష్టమైన భద్రతా బలగాల మధ్య కౌంటింగ్ నిర్వహణకు అన్ని ఏర్పాట్లను సిద్ధం చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి విజయరామరాజు పేర్కొన్నారు. మంగళవారం కడప రిమ్స్ సమీపంలోని మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఉర్దూ నేషనల్ యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రాన్ని జిల్లా ఎస్పీ సిద్దార్థ్ కౌశల్ తో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ స్ట్రాంగ్ రూముల్లో పోస్టల్ బ్యాలెట్ ఓట్లతో పాటు, పోలింగ్ కేంద్రాల్లో పోలైన ఓట్లతో నిక్షిప్తమైన ఈవీఎంలను అత్యంత సురక్షితంగా భద్రపరిచినట్లు వివరించారు. పార్లమెంట్, ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్‌కు 14 చొప్పున ఈవీఎం టేబుళ్లను, అలాగే పోస్టల్ బ్యాలెట్ కు కూడా 14 టేబుళ్లను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. కౌంటింగ్ హాలులో ఓట్ల లెక్కింపు సజావుగా, సౌకర్యవంతంగా జరిగేలా సెటప్ చేసినట్లు తెలిపారు. అదేవిధంగా వివిధ రాజకీయ పార్టీల ఏజెంట్లు కౌంటింగ్ ప్రక్రియను పరిశీలించేందుకు వీలుగా ఏర్పాట్లు చేశామన్నారు. ఓట్ల లెక్కింపు కోసం ఇప్పటికే సిబ్బందిని ఏర్పాటు చేసి మైక్రోఅబ్జర్వర్లు, కౌంటింగ్ ఏజెంట్లు, సూపర్ వైజర్లు, శిక్షణా కార్యక్రమం నిర్వహించామన్నారు. ఏ చిన్నపాటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కడప, బద్వేలు రిటర్నింగ్ అధికారులు మధుసూదన్, వెంకటరమణ, పోలీసు అధికారులు తదితరులు పాల్గొన్నారు.
సీసీ కెమెరాల నిఘాలో ఓట్ల లెక్కింపు
కౌంటింగ్ కేంద్రంలో మొత్తం 112 సీసీ కెమెరాల నిఘాలో ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని చేపడతామని జిల్లా ఎన్నికల అధికారి తెలిపారు. ఇప్పటికే ఈ నెల 25న కౌంటింగ్ స్టాఫ్ కు మొదటి రాండమైజేషన్ పూర్తి చేసి కౌంటింగ్ సిబ్బందిని ఏర్పాటు చేశామన్నారు. జూన్ 2న రెండో రాండమైజేషన్, 4వ తేదీ కౌంటింగ్ రోజున ఉదయం 5 గంటలకు 3వ రాండమైజేషన్ ప్రక్రియ పూర్తి చేయనున్నట్లు చెప్పారు. ఈ కౌంటింగ్ ప్రక్రియ అంతా కూడా ఎన్నికల సాధారణ/ కౌంటింగ్ పరిశీలకులు, రిటర్నింగ్ అధికారులు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు, కౌంటింగ్ ఏజెంట్ల సమక్షంలో జరుగుతుందన్నారు.
● పార్లమెంట్, అసెంబ్లీకి సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ జూన్ 4న ఉదయం 8 గంటల నుంచి ప్రారంభమవుతుందని, అసెంబ్లీ స్థానాలకు మొదట పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ప్రారంభం అవుతుందన్నారు. పార్లమెంట్ కు సంబంధించి మొదటగా ఈవీఎంల ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుందన్నారు. రాజకీయ పార్టీల తరఫున కౌంటింగ్ ఏజెంట్ల పాసుల కోసం ఈ నెల 30వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ ఏజెంట్స్ కోసం డీఆర్వో వద్ద, ఈవీఎం ఓట్ల లెక్కింపు ఏజెంట్ల కోసం ఆయా నియోజకవర్గ రిటర్నింగ్ అధికారులను సంప్రదించాలన్నారు. కౌంటింగ్ ఏజెంట్లు ఉదయం 7 గంటలలోపు కౌంటింగ్ కేంద్రానికి చేరుకోవాలన్నారు. కౌంటింగ్ కేంద్రం/హాల్ లోకి అభ్యర్థి లేదా కౌంటింగ్ ఏజెంట్ ఒక్కరికి మాత్రమే అనుమతి ఉంటుందన్నారు. సర్పంచ్, మేయర్, ఇతర కార్పోరేషన్ చైర్మన్ లు, ప్రభుత్వ సలహాదారులు, లోకల్ బాడీ మెంబర్లు తదితర ప్రజాప్రతినిధులకు కుడా అనుమతి లేదన్నారు. కౌంటింగ్ ప్రక్రియ పూర్తయ్యేవరకు లోపలికి వచ్చిన కౌంటింగ్ సిబ్బంది, ఏజెంట్లు బయటికి వెళ్లడానికి అనుమతి లేదన్నారు.
6వ తేదీ వరకు 144 సెక్షన్ అమలు
భద్రతా చర్యల్లో భాగంగా 6వ తేదీ వరకు 144 సెక్షన్ అమలులో ఉంటుందన్నారు. ప్రత్యేక నిఘాతో పాటు భద్రతా చర్యల్లో భాగంగా పోలీసు ఆంక్షలను కఠినతరం చేయడం జరుగుతుందన్నారు. గతంలో నేర చరిత్ర ఉన్న రాజకీయ పార్టీల ప్రతినిధులకు వారి ప్రవర్తనను అనుసరించి 4వ తేదీ నుండి 6వ తేదీ వరకు ముందస్తు బైండోవర్ కేసులు, జిల్లా బహిష్కరణ, గృహ నిర్బంధం వంటి చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.
ఆంక్షలు కఠినతరం
సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని సజావుగా, పారదర్శకంగా, పటిష్టంగా నిర్వహించేందుకు శాంతి భద్రతల దృష్ట్యా ఆంక్షలను కఠినతరం చేయడం జరుగుతుందని జిల్లా ఎన్నికల అధికారి విజయ్ రామరాజు పేర్కొన్నారు. మంగళవారం కలెక్టరేట్ బోర్డు మీటింగ్ హాలులో సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు, ఎంసీసీ అమలు, 144 సెక్షన్ పాటింపుపై జిల్లా ఎస్పీ సిద్దార్థ్ కౌశల్‌తో కలిసి గుర్తింపు పొందిన రాజకీయ పార్టీ ప్రతినిధులతో జిల్లా ఎన్నికల అధికారి సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణలో భాగంగా జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో పోలింగ్ ప్రశాంతంగా జరిగేందుకు సహకరించిన రాజకీయ పార్టీల ప్రతినిధులందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఎన్నికల ప్రక్రియలో చివరి ఘట్టమైన ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని జూన్ 4వ తేదీన పారదర్శకంగా, శాంతియుతంగా నిర్వహించేందుకు అన్నిరకాల భద్రతా చర్యలను తీసుకున్నట్లు చెప్పారు.