
పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేయాలి
కడప సెవెన్‌రోడ్స్ : ఎన్నికల కోడ్ అమలుకు ముందు ఆమోదం పొంది పెండింగ్‌లో ఉన్న అన్ని రకాల అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్ విజయరామరాజు అధికారులను ఆదేశించారు. సోమవారం కడప జిల్లా పరిషత్ సభాభవన్‌లో జేసీ గణేష్ కుమార్, నగర కమిషనర్ ప్రవీణ్‌చంద్, పాడా ఓఎస్డీ అనిల్ కుమార్‌రెడ్డి, డీఆర్వో గంగాధర్‌గౌడ్‌లతో కలిసి పనుల పురోగతి, ఇతర అంశాలపై సీహెచ్‌ఓలు, ఎంహెచ్‌ఓలతో సమీక్షించారు. ఇదే సమయంలో మండల స్థాయి, నియోజకవర్గ స్థాయి అధికారులతో కలెక్టర్ నేరుగా సమీక్షించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ సేవలు, పెండింగ్‌లోఉన్న అభివృద్ధి పనులపై అధికారులందరూ ప్రత్యేక దృష్టి సారించి వెంటనే పూర్తి పని చేయాలన్నారు. ఆయా మండలాలు, మున్సిపాలిటీల పరిధిలో గృహనిర్మాణ పనులను లక్ష్యం మేరకు పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రతి గురువారం మండల స్థాయి అధికారులతో క్రమం తప్పకుండా ప్రత్యేక సమీక్ష నిర్వహించనున్నట్లు చెప్పారు. ప్రజారోగ్య భద్రత గురించి మాట్లాడుతూ గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పారిశుధ్యంపై ఎంపీడీవోలు, మున్సిపల్ అధికారులు, పంచాయతీ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఎక్కడా కూడా తాగునీటి సమస్యలు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రస్తుతం నదీ తీరాల్లో ఎక్కడా కూడా ఇసుక సరఫరా చేయడానికి వీలు లేదన్నారు.
మండలాలకు టెలి కమ్యూనికేషన్ సెట్స్
జిల్లా వ్యాప్తంగా అధికారులకు కమ్యూనికేషన్ నెట్ వర్క్ మెరుగ్గా నిర్వహించడానికి మొత్తం 23 వేర్వేరు ఛానళ్ల ద్వారా రెవెన్యూ సర్వీసులపై సమీక్షించుకునేందుకుకు కమ్యూనికేషన్ సెట్స్ అందివ్వనున్నట్లు చెప్పారు. ఆర్డీఓలతో పాటు ప్రతి మండలానికి ఎంపీడీఓలు, తహసీల్దార్లకు, సీఎస్‌ఓలు, ఎంఎస్‌ఓలకు ఇంజినీరింగ్, హౌసింగ్ అధికారులకు వెంటనే సమాచారాన్ని చేరవేయడం, సమీక్షించడంతోపాటు అత్యవసర సమయాల్లో, విఫత్తుల సమయంలో తక్షణ సమాచార సేకరణ కోసం టెలి సెట్స్ ఎంతో ఉపయోగపడనున్నాయన్నారు. సమావేశంలో అన్ని రెవెన్యూ డివిజన్ల ఆర్డీవోలతో పాటు నియోజకవర్గ, మండల ప్రత్యేక అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, తహసీల్దార్లు తదితరులు హాజరయ్యారు.