సంస్థాన్ నారాయణపురం: తేమ పేరుతో ధాన్యం కొనుగోలులో జాప్యం చేయవద్దనితెలంగాణ రైతు సంఘం ప్రధాన కార్యదర్శి పశ్య పద్మ కోరారు. మంగళవారం సంస్థాన్‌నారాయణపురం మండల కేంద్రంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆమె పరిశీలించి మాట్లాడారు. ధాన్యం కొనుగోళ్లు ఆలస్యం కావడంతో రైతులు రోజుల తరబడి పడిగాపులు కాస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వర్షాలతో ధాన్యం తడిసిపోయే ప్రమాదం ఉన్నందున ప్రభుత్వం వెంటనే కొనుగోళ్లు వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. క్వింటాకు ఒకటి, రెండు కిలోలు కోత విధించే పద్ధతిని నిలిపివేసి మద్దతు ధరతో పాటు డబ్బులను సకాలంలో చెల్లించాలన్నారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం రాష్ట్ర సీనియర్ నాయకుడు తోకల రామిరెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి పల్లె మల్లారెడ్డి, సర్పంచ్ ముత్యాల అంజయ్య, సీపీఐ పట్టణ సహాయ కార్యదర్శి పందుల యాదగిరి, పల్లె రాములు, ఈద మల్లయ్య, లక్ష్మణ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.


