సాక్షి , యాదాద్రి: ఎల్ నినో ప్రభావం పశుగ్రాసంపై పడింది. యాసంగిలో వరి సాగు తగ్గుతుందన్న అంచనాతో పాడి రైతులు ముందుజాగ్రత్తగా ఎండుగడ్డిని భారీగా నిల్వ చేసుకుంటున్నారు. దీనికి తోడు కోత యంత్రాల వల్ల దిగుబడి తగ్గడంతో గడ్డి ధరలకు రెక్కలొచ్చాయి. గతంతో పోలిస్తే ట్రాక్టర్ వరిగడ్డిపై రూ.2 వేలు అదనంగా పెరగడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
కోతల వల్ల తగ్గిన దిగుబడి
మూసీ పరివాహక ప్రాంతాలైన పోచంపల్లి, రామన్నపేట, వలిగొండ, బీబీనగర్, భువనగిరి, అడ్డగూడూరు మండలాల్లో పొలాలు ఆరకపోవడంతో రైతులు చైన్ హార్వేస్టర్లతో వరి కోయించారు. దీనివల్ల గడ్డి బురదలోనే ఉండిపోయి దిగుబడి తగ్గింది. మరోవైపు స్థానిక వ్యాపారులు మహేశ్వరం, ఇబ్రహీంపట్నం, కందుకూరు, హైదరాబాద్ ప్రాంతాలకు ఆర్డర్లపై గడ్డిని తరలిస్తున్నారు. ఒక్క పోచంపల్లి మండలం నుంచే సీజన్‌కు సుమారు 2 వేల ట్రాక్టర్ల గడ్డి రవాణా అవుతోంది.
ట్రాక్టర్ గడ్డి ధరలు ఇలా..
ప్రస్తుతం ఒక ట్రాక్టర్ గడ్డి కొనుగోలు చేసి ఇంటికి చేర్చడానికి రూ.13 వేల నుంచి రూ.15 వేల వరకు ఖర్చవుతోంది. ఇందులో రైతుకు రూ.4,000, కట్టలు కట్టడానికి రూ.3,200, కూలీలకు రూ.2,000, దూరాన్ని బట్టి ట్రాక్టర్ కిరాయి రూ.4,000 నుంచి రూ.5,000 వరకు అవుతోంది.
జిల్లాలో పశుగ్రాసం లోటు
ప్రభుత్వ లెక్కల ప్రకారం జిల్లాలోని 3.30 లక్షల పశు యూనిట్లకు పది నెలలకు 48,62,565 క్వింటాళ్ల ఎండుగడ్డి అవసరం ఉండగా, 46,19,437 క్వింటాళ్లు మాత్రమే అందుబాటులో ఉంది. అంటే 2,43,128 క్వింటాళ్ల లోటు ఉంది. అలాగే 29,17,539 క్వింటాళ్ల పచ్చిగడ్డికి గాను 23,34,031 క్వింటాళ్లే లభ్యమవుతుండటంతో 5,83,508 క్వింటాళ్ల కొరత ఏర్పడింది. దీంతో రైతులు జొన్న, మొక్కజొన్న చొప్పలపై ఆధారపడుతున్నారు.
ఆవులు : 67,114
గేదెలు : 1,07,444
గొర్రెలు : 5.45 లక్షలు
మేకలు : 1.23 లక్షలు
ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందనే అంచనాతో జనగాం గ్రామానికి చెందిన బైకని యాదయ్య ముందస్తుగా పశుగ్రాసం నిల్వ చేసుకుంటున్నాడు. తనకు మూడు గేదెలు, నాలుగు ఎద్దులు ఉండగా వాటి మేత కోసం ఒక్కో కట్ట రూ.150 చొప్పున 200 గడ్డి కట్టలు కొనుగోలు చేశాడు. ఇందుకోసం రూ.30 వేలు ఖర్చు చేశాడు. ఇప్పటికే వంద కట్టలు నిల్వ ఉన్నప్పటికీ పళ్ళగట్టు తండా రైతుల వద్ద మరో 200 కట్టలు కొనుగోలు చేశాడు. పశుగ్రాసం కొరత ఏర్పడితే ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
ఫ ఎల్ నినో ఎఫెక్ట్.. యాసంగిలో సాగు తగ్గుతుందన్న అంచనాతో పెరిగిన డిమాండ్
ఫ ట్రాక్టర్ వరిగడ్డి రూ.13 వేల నుంచి రూ.15 వేల వరకు..
ఫ చైన్ హార్వేస్టర్లతో కోతలు.. బురదలో కలుస్తున్న పశుగ్రాసం
ఫ జిల్లాలో 2.43 లక్షల క్వింటాళ్ల ఎండుగడ్డి లోటు


