నిఘా పెంచాలి
సాక్షి, యాదాద్రి: వరుస దొంగతనాలతో ప్రజలు హడలిపోతున్నారు. రెండు మూడు రోజులు ఇంటికి తాళం వేసి ఊరెళ్తే చాలు దొంగలు ఇళ్లను గుల్ల చేస్తున్నారు. జిల్లాలో ఇళ్లు, దేవాలయాలే కాకుండా పశువులు, గొర్రెలు, మేకలు, వాహనాల్లోని డీజిల్, పెట్రోల్, మద్యం, చివరికి వ్యవసాయ బావుల వద్ద మోటార్ల విద్యుత్ వైర్లను సైతం వదలకుండా దోచుకుపోతున్నారు. భువనగిరి పట్టణంతో పాటు 17 పోలీస్ స్టేషన్ల పరిధిలో చోరీలు ఎక్కువయ్యాయి.
రికవరీ అంతంతమాత్రమే..
జనసంచారం లేని శివారు ప్రాంతాల్లో ముందుగా రెక్కీ నిర్వహిస్తున్న దొంగలు పక్కా ప్లాన్‌తో సొత్తు అపహరిస్తున్నారు. పోలీస్ రికార్డుల ప్రకారం గతేడాది జిల్లాలో రూ. 5.40 కోట్ల విలువైన బంగారం, వెండి, నగదు చోరీకి గురైతే, కేవలం రూ. 99.99 లక్షలు మాత్రమే రికవరీ అయ్యింది. ఈ ఏడాది కూడా చోరీలు కొనసాగుతున్నా, ఉన్నతాధికారులకు రికవరీ చూపించాల్సి వస్తుందన్న ఉద్దేశంతో పోలీసులు కొన్ని కేసులను నమోదు చేయడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
జిల్లాలో జరిగిన కొన్ని దొంగతనాలు
● యాదగిరిగుట్ట మండలం వంగపల్లిలో ఆరు నెలల క్రితం ఓ ఇంట్లో 12 తులాల బంగారం చోరీ అయ్యింది. ఇంతవరకు సొత్తు రికవరీ కాలేదు. ఇదే గ్రామంలో ఐదు నెలల క్రితం ఓ ఇంటి ముందు పార్క్ చేసిన బైక్ దొంగతనం జరిగింది. బాధితుడు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. నెల రోజుల క్రితం బైక్‌దొరికిందని పోలీసులు తెలిపినట్లు బాధితుడు చెప్పాడు.
● సెప్టెంబర్ 19న పోచంపల్లిలోని శ్రీ మద్దెలమ్మ దేవాలయంలో హుండీలోని రూ. 25వేల నగదు, సీసీ కెమెరాలు ఎత్తుకెళ్లారు. జగత్‌పల్లి, పెద్దరావులపల్లిలో 50 కరెంటు మోటార్ల కాపర్ వైర్లను కత్తిరించుకుపోయారు.
● సెప్టెంబర్ 27న చౌటుప్పల్ మండలం తూ ప్రాన్ పేటలో మంటిపల్లి యాదమ్మ అనే వృద్ధురాలిని హత్య చేసి బంగారు, వెండి నగలతో పాటు నగదు తీసుకొని గ్రామస్తుడు పారిపోయాడు.
● అక్టోబర్ 27న రాయిగిరిలోని ప్రధాన రహదారి పై ఉన్న ఓ వైన్స్‌లో రూ.40 వేల నగదు, కొన్ని మద్యం సీసాలు చోరికి గురయ్యాయి.
● అక్టోబర్ 31న చౌటుప్పల్‌లో రాళ్ల బండి సుధాకర్ అనే వ్యక్తిని హత్య చేసి1.320 కిలోల బంగారు, 3.50 కిలోల వెండి ఆభరణాలు, రూ.9.50 లక్షల నగదును అపహరించారు.
● మోటకొండూరులో 10 చోరీలు జరగగా, ఆలేరు బీసీ కాలనీ, వంగపల్లి, మోత్కూరు, గుండాల మండలాల్లో బంగారం, బైక్‌లు, పశువుల దొంగతనాలు జరిగాయి.
● ఈనెల 14న భువనగిరి పట్టణంలోని హోటళ్లు, ఇళ్ల ముందు నిలిపి ఉంచిన వాహనాల్లో పెట్రోల్ దొంగతనం జరిగింది.
● ఈనెల 14న చౌటుప్పల్ మండల పరిధిలోని ఆరెగూడెంలో ఒకేరోజు తాళం వేసి ఉన్న మూడు ఇళ్లలో రెండు తులాల బంగారు, 53 తులాల వెండి ఆభరణాలతో పాటు రూ.5వేల నగదును దొంగలు అపహరించుకుపోయారు.
● ఈనెల 17న చౌటుప్పల్ మండలం ధర్మాజీగూడెంలో 17 గొర్రెలు అపహరించుకుపోయారు.
● ఈనెల 18న భువనగిరి పట్టణంలోని ప్రగతి నగర్‌లో ఇంటిముందు కట్టేసిన మేకలను దొంగలు అపహరించుకుపోయారు. పహాడీనగర్‌లో ఇంటి మందు పెట్టిన బైక్ చోరీకి గురైంది.
జిల్లాలో దొంగల స్వైరవిహారం
ఫ తాళం వేసిన ఇళ్లే లక్ష్యంగా రెక్కీ నిర్వహించి మరీ దోపిడీలు
ఫ బంగారం, నగదే కాదు.. మేకలు, గొర్రెలు, పెట్రోల్, మోటార్ వైర్లూ మాయం
ఫ రికవరీ భయంతో చాలా కేసులు నమోదు చేయడంలో పోలీసుల వెనకడుగు
దొంగతనాల కట్టడికి రాత్రి వేళల్లో ప్రత్యేక పెట్రోలింగ్, బీట్‌లను పెంచాలని ప్రజలు కోరుతున్నారు. జైలు నుంచి విడుదలైన పాత నేరస్తులు, ఉపాధి కోసం ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన కొత్త వ్యక్తుల కదలికలపై నిఘా పెట్టాలని, గ్రామాల్లో యువతతో అవగాహన సదస్సులు నిర్వహించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.


