ఉత్సాహభరితంగా ప్రతినిధుల సభ
నల్లగొండ టౌన్ : కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం అవలంబిస్తున్న కార్పొరేట్ అనుకూల విధానాలను తిప్పికొట్టేందుకు ఐక్య పోరాటాలు సాగిద్దామని ఏఐకేఎస్ నేతలు పిలుపునిచ్చారు. దేశంలో మతతత్వ శక్తులను ఎదుర్కొనేందుకు దేశవ్యాప్తంగా ఉన్న ప్రజాస్వామిక, లౌకిక శక్తులన్నింటినీ ఏకం చేస్తామన్నారు. గతంలో ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు సాగించిన 13 నెలల సుదీర్ఘ పోరాటం అన్నదాతల ఐక్యతకు నిదర్శనమని గుర్తు చేశారు. భవిష్యత్‌లోనూ ఇదే తరహా పోరాటాలతో రైతు వ్యతిరేక విధానాలను అనుసరిస్తున్న పాలకులను గద్దె దింపుతామన్నారు. ఆల్ ఇండియా కిసాన్ సభ (ఏఐకేఎస్) 36వ అఖిల భారత మహాసభలు నల్లగొండ జిల్లా కేంద్రంలోని సారంపల్లి మల్లారెడ్డి నగర్, వీఎస్.అచ్యుతానందన్ హాల్లో సోమవారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఏఐకేఎస్ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ అశోక్ ధావలే మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ఆద్వర్యంలోని ప్రభుత్వం కొనసాగితే స్థానికులు, రైతులు, వ్యవసాయ కార్మికులతో పాటు సమాజంలోని అన్ని వర్గాల ప్రజలపై దాడులు తీవ్రమవుతాయన్నారు. ఆర్ఎస్ఎస్, బీజేపీతో పాటు వాటి అనుబంధ మతతత్వ సంస్థల విధానాలు ఎదుర్కొనేందుకు బహుముఖ పోరాటాలు నిర్వహించాలన్నారు. ప్రజాస్వామిక, లౌకిక శక్తులను ఐక్యం చేయడంతో పాటు వామపక్ష శక్తులను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలను ప్రతిఘటించేందుకు కార్మిక, రైతాంగ, వ్యవసాయ సంఘాలన్నింటిని ఐక్య పోరాటాలకు తీసుకురావాలని తెలిపారు. అనంతరం పలు రైతు సంఘాల నాయకులు రాకేష్ టికాయత్, రావుల వెంకయ్య, శంకర్ ఘోష్, పురుషోత్తం శర్మ, ఐద్వా జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీమతి టీచర్ మాట్లాడారు. ఆ తర్వాత ఏఐకేఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి విజూ కృష్ణన్ తన నివేదిక సమర్పించారు. కార్యక్రమంలో మహాసభల ఆహ్వాన సంఘం అధ్యక్షుడు జూలకంటి రంగారెడ్డి, కోశాధికారి పి.కృష్ణప్రసాద్, ఉపాధ్యక్షులు హన్నన్‌మొల్లా, అమ్రారామ్, ఈపీ.జయరంజన్, ఎస్కే.ప్రీజ, హమాల్ అల్దార్, పి.షణ్ముగం, బిప్లవ్ మజుందార్, ఎం.విజయ్‌కుమార్, ఇంద్రజిత్‌సింగ్, సంయుక్త కార్యదర్శులు బాదల్ సరోజ్, వల్సన్ పనోలి, పబిత్రకార్, ముకుత్సింగ్, తీగల సాగర్, డి.రవీంద్రన్, అజిత్ నావలే, అవదేశ్‌కుమార్, వినోద్‌కుమార్, రఘువీర్ గుడిగాయ్, సీఐటీయూ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎలమారం కరీం, జాతీయ నాయకులు సింధు, ఎం.సాయిబాబు, అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి బి.వెంకట్, జాతీయ ఉపాధ్యక్షుడు సుభాష్ జెక్కర్, తెలంగాణ రైతు సంఘం అధ్యక్షుడు పోతినేని సుదర్శన్, కోశాధికారి ఎం.శోభన్, మహాసభ ప్రతినిధులు పాల్గొన్నారు.
మహాసభల ప్రారంభ సూచకంగా జెండా ఆవిష్కరిస్తున్న అశోక్ ధావలే
చారిత్రాత్మక తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట పురిటిగడ్డ నల్లగొండ వేదికగా ఏఐకేఎస్ జాతీయ మహాసభలు సోమవారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ మహాసభలకు దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి వెయ్యి మందికి పైగా రైతు ప్రతినిధులు, మేధావులు, ఉద్యమకారులు తరలివచ్చారు. తొలుత ఏఐకేఎస్ పతాకాన్ని జాతీయ అధ్యక్షుడు అశోక్ ధావలే ఆవిష్కరించారు. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన అమరవీరుల స్థూపం వద్ద పలువురు ప్రజా ఉద్యమ నాయకులు, రైతులు, మేధావులు నివాళి అర్పించారు.
ఫ కార్పొరేట్ విధానాలను తిప్పికొడదాం
ఫ ప్రజాస్వామిక, లౌకిక శక్తులు ఏకం కావాలి
ఫ రైతు వ్యతిరేకులను సాగనంపాల్సిందే..
ఫ ఏఐకేఎస్ మహాసభల్లో రైతు నేతల ఉద్ఘాటన


