యాదగిరిగుట్ట రూరల్ : ప్లాస్టిక్ వ్యర్థాల వల్ల వచ్చే కాలుష్యాన్ని అరికట్టి పర్యావరణాన్ని రక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ప్లాస్టిక్ రీ సైక్లింగ్ యూనిట్ (వ్యర్థాల శుద్ధి కర్మాగారం)లను ఏర్పాటు చేయడానికి పూనుకుంది. ఇందులో భాగంగా యాదగిరిగుట్ట మండలం సైదాపురం గ్రామంలో ఈ ప్లాస్టిక్ వేస్టేజ్ రీసైక్లింగ్ యూనిట్ నిర్మాణ పనులను చేపట్టింది. రెండు నెలల నుంచి యూనిట్‌కు సంబంధించిన షెడ్డు నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. దీనిని త్వరలోనే వినియోగంలోకి తీసుకురావడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఆలేరు నియోజకవర్గంలోని అన్ని మండలాల్లోని డంపింగ్ యార్డుల్లో సేకరించిన ప్లాస్టిక్‌ను ఈ యూనిట్‌కు తరలించి రీ సైక్లింగ్ చేయనున్నారు.
ప్లాస్టిక్ వ్యర్థాలను రీసైక్లింగ్ చేసేలా..
కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ భారత్ మిషన్ కింద ఈ ప్లాస్టిక్ వేస్టేజ్ రీ సైక్లింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేయడానికి రూ.64 లక్షల నిధులను విడుదల చేసింది. రోజూ 700 కిలోల వరకు ప్లాస్టిక్ వ్యర్థాలను ఈ యూనిట్‌కు చేరవేసి రీ సైక్లింగ్ చేసేలా అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఈ యూనిట్ వల్ల స్థానికులకు ఉపాధి లభించే అవకాశం ఉంది.
ప్లాస్టిక్ వ్యర్థాలతో కొత్త ఉత్పత్తులు
ఈ యూనిట్‌లో రీసైక్లింగ్ చేసిన ప్లాస్టిక్ వేస్టేజ్‌ను నూతన ఉత్పత్తులను తయారు చేయడానికి మరొక ప్రాంతానికి తరలిస్తారు. ఆ తర్వాత మానవ అవసరాలకు ఉపయోగపడే విధంగా కొత్త ఉత్పత్తులను తయారు చేస్తారు.
ఫ స్వచ్ఛ భారత్ మిషన్ కింద రూ.64 లక్షలతో షెడ్డు నిర్మాణ పనులు
ఫ ఆలేరు నియోజకవర్గంలోని డంపింగ్ యార్డుల నుంచి ప్లాస్టిక్ సేకరణ
ఫ రోజూ 700 కిలోల వ్యర్థాల రీసైక్లింగ్‌కు ఏర్పాట్లు


