యాదగిరిగుట్ట రూరల్: గోదావరి నీళ్లు ఎత్తిపోసి పంటలను కాపాడాలని మల్కాజ్‌గిరి బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు. గ్రామాల్లో పంటలు ఎండుతున్నాయని, ట్రాన్స్‌ఫార్మర్‌లు పేలిపోతున్నాయని , మోటార్లు కాలిపోయే పరిస్థితి వచ్చిందన్నారు. నీళ్లు లేక హైదరాబాద్ నగరంలో హాస్టల్ విద్యార్థులకు సెలవులు ఇచ్చి ఇంటికి పంపిస్తున్నారని తెలిపారు. గోదావరి నీళ్లతో, మిషన్ భగీరథ, హైదరాబాద్‌కు నీళ్ల కొరత లేకుండా చేయాలని సూచించారు. ఆయన సోమవారం యాదగిరిగుట్ట మండలం వంగపల్లి గ్రామంలో ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నీటి సమస్యలపై ఆల్ పార్టీ మీటింగ్ ఏర్పాటు చేయాలని, అఖిల పక్షాలను పిలిచే సంస్కారం రేవంత్ రెడ్డికి లేదని విమర్శించారు. డబ్బు సంచులను రాహుల్‌గాంధీ, సోనియా గాంధీకి పంపించే ధ్యాసలో కొంతైనా, సాగు, తాగు నీరు, కరెంటు, ప్రజల సమస్యలపై లేదన్నారు. కేసీఆర్ మీద కోపంతో తెలంగాణ రైతులను శిక్షించవద్దని గతంలో కూడా చెప్పామని గుర్తుచేశారు. కేవలం మోదీ వ్యతిరేక శక్తులను తీసుకొచ్చి, దేశంలో ప్రజాస్వామ్యం లేదని, దేశ ప్రతిష్టను మట్టిలో కలిపే ప్రయత్నం రాహుల్ గాంధీ చేస్తున్నారని విమర్శించారు. పార్లమెంటులో మాట్లాడే సత్తా రాహుల్ గాంధీకి లేదని, మోదీ ఉన్నంత వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే ఆస్కారం లేదన్నారు. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను సీఎం రేవంత్‌రెడ్డి నెరవేర్చాలన్నారు. ఈటల వెంట బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కాసం వెంకటేశ్వర్లు, జిల్లా అధ్యక్షుడు ఉట్కూరి అశోక్ గౌడ్, నాయకుడు పాశం భాస్కర్ తదితరులు ఉన్నారు.
ఫ మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్


