ఫ పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న మైనారిటీ అభ్యర్థులకు ఉచితంగాస్టడీ మెటీరియల్ పంపిణీ
ఫ తెలంగాణ మైనారిటీస్ స్టడీ సర్కిల్, కెరీర్ కౌన్సెలింగ్ సెంటర్ ప్రత్యేక చొరవ
ఫ ఈ నెల 12 వరకు దరఖాస్తుల స్వీకరణ
ప్రభుత్వ ఉద్యోగాల కోసం శ్రమిస్తున్న పేద మైనారిటీ విద్యార్థులకు ఖరీదైన పుస్తకాల భారాన్ని తప్పించి, వారి సన్నద్ధతకు చేయూతనివ్వడమే ప్రభుత్వ ప్రధాన సంకల్పం. అర్హులైన అభ్యర్థులందరూ వెంటనే దరఖాస్తు చేసుకోవాలి. ఏమైనా సందేహాలుంటే 95056 40004 నంబరును సంప్రదించాలి.
– జయమ్మ, మైనార్టీ సంక్షేమ ఇన్‌చార్జ్ అధికారి
భువనగిరిటౌన్: ప్రభుత్వ ఉద్యోగమే లక్ష్యంగా రాత్రింబవళ్లు శ్రమిస్తున్న నిరుపేద మైనారిటీ యువత కలలను సాకారం చేసేందుకు ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేసింది. మార్కెట్లో వేలకు వేలు వెచ్చించి పుస్తకాలు కొనుగోలు చేయలేని అభ్యర్థులకు అండగా నిలిచేందుకు తెలంగాణ మైనారిటీస్ స్టడీ సర్కిల్ మరియు కెరీర్ కౌన్సెలింగ్ సెంటర్ ప్రత్యేక చొరవ తీసుకుంది. మైనారిటీ వర్గాల్లోని పేద, ప్రతిభావంతులైన అభ్యర్థులకు పోటీ పరీక్షల స్టడీ మెటీరియల్‌తో పాటు ప్రామాణిక పుస్తకాలను ఉచితంగా అందజేయాలని నిర్ణయించింది. ఈ మేరకు శనివారం కలెక్టరేట్‌లోని తన కార్యాలయంలో జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ ఇన్‌చార్జ్ అధికారి జయమ్మ వెల్లడించారు.
ఉద్యోగ సాధనే లక్ష్యంగా..
ప్రస్తుతం రాష్ట్రంలో వరుసగా ఉద్యోగ ప్రకటనలు వెలువడుతున్న తరుణంలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని ఆర్థిక స్థోమత లేని మైనారిటీ యువత పోటీలో వెనుకబడిపోకూడదనే ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ముస్లిం, క్రిస్టియన్, బౌద్ధ, జైన్, పార్సీ మైనారిటీ వర్గాలకు చెందిన అభ్యర్థులకు సబ్జెక్ట్ నిపుణులు రూపొందించిన పుస్తకాలను ఉచితంగా అందించడం ద్వారా వారి విజయావకాశాలను మెరుగుపరచవచ్చని అధికారులు భావిస్తున్నారు.
ఏయే పరీక్షలకు వర్తిస్తుంది
రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన రెండు ప్రధాన విభాగాల పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి ఈ పుస్తకాలు పంపిణీ చేయనున్నారు. తెలంగాణ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు ద్వారా భర్తీ చేసే పోలీస్ కానిస్టేబుల్, సబ్ ఇన్‌స్పెక్టర్ పోస్టుల ప్రాథమిక, ప్రధాన పరీక్షలకు సంబంధించిన పుస్తకాలు. అదేవిధంగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే గ్రూప్–1, గ్రూప్–2, గ్రూప్–3, గ్రూప్–4 స్థాయి ఉద్యోగాల జనరల్ స్టడీస్, సంబంధిత పేపర్ల స్టడీ మెటీరియల్ అందజేయనున్నారు.
దరఖాస్తు ప్రక్రియ
ఉచిత పుస్తకాల కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు తమ వివరాలతో పాటు క్రింది ధ్రువపత్రాల జీరాక్స్ పత్రాలను జతచేయాల్సి ఉంటుంది.
● మైనారిటీ కమ్యూనిటీ ధ్రువీకరణ పత్రం.
● విద్యార్హత ధ్రువీకరణ పత్రాలు (పదో తరగతి, ఇంటర్మీడియట్, లేదా డిగ్రీ మార్కుల జాబితా).
● పోటీ పరీక్షకు దరఖాస్తు చేసుకున్నట్లు నిర్ధారించే రిజిస్ట్రేషన్ కాపీ.
● ఆధార్ కార్డు జీరాక్స్, పాస్‌పోర్ట్ సైజ్ ఫొటో.
దరఖాస్తులు ఎక్కడ సమర్పించాలి
అర్హత గల అభ్యర్థులు తమ దరఖాస్తులను పూర్తి చేసి, అవసరమైన పత్రాలను జతపరిచి ఈనెల 12లోగా కార్యాలయ పనివేళల్లో స్వయంగా జిల్లా మైనారిటీల సంక్షేమ కార్యాలయంలో అందజేయాలి.


