భువనగిరిటౌన్ : జిల్లాలో బియ్యం కృత్రిమ కొరత సృష్టించినా, అక్రమ నిల్వలకు పాల్పడినా, అధిక ధరలకు విక్రయించినా చర్యలు తప్పవని అదనపు కలెక్టర్ వెంకారెడ్డి హెచ్చరించారు. బియ్యం లభ్యత, నిల్వలు, ధరలపై శనివారం కలెక్టరేట్‌లో హోల్‌సేల్, రిటైల్ వ్యాపారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. మార్కెట్లో బియ్యంతో పాటు 22 రకాల నిత్యావసర సరుకుల నిల్వలు, ధరలను పరిశీలించారు. ప్రతి వ్యాపార దుకాణం ఎదుట స్టాక్ బోర్డులను ఏర్పాటు చేసి బియ్యం రకం, నిల్వ పరిమాణం, కిలో విక్రయ ధరలను స్పష్టంగా రాయాలన్నారు. అక్రమ వ్యాపారం లేదా అధిక ధరలపై ఫిర్యాదుల కోసం 92814 23621 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు. సమావేశంలో జేఏసీ చైర్మన్ మందడి ఉపేందర్ రెడ్డి, జిల్లా పౌరసరఫరాల అధికారి రోజారాణి, భువనగిరి ఆర్డీఓ కృష్ణా రెడ్డి, విజిలెన్స్ అధికారులు, రైస్ మిల్లర్లు, రేషన్ డీలర్లు, పెట్రోల్ బంకుల సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.


