ముందుంది జల గండం! | - | Sakshi
Sakshi News home page

ముందుంది జల గండం!

Oct 30 2026 7:36 AM | Updated on Oct 30 2026 7:36 AM

నీటి ఎద్దడి నివారించాలి

సాక్షి, యాదాద్రి: కరువు జిల్లా యాదాద్రిలో తాగునీటి సమస్య రోజురోజుకూ తీవ్రమవుతోంది. జిల్లా వ్యాప్తంగా ప్రజల తాగునీటి డిమాండ్‌కు, క్షేత్రస్థాయిలో అందుతున్న సరఫరాకు ఏమాత్రం పొంతన లేదు. భూగర్భ జలాలు అడుగంటడంతో స్కీం బోర్లు, అద్దె బోర్లు ఆగి ఆగి పోస్తున్నాయి. అరకొరగా వస్తున్న మిషన్‌ భగీరథ నీటికి, స్థానిక బోర్ల నీటిని కలిపి గ్రామాల్లో సరఫరా చేస్తున్నారు. సరిపడా నీరు రాక కొన్ని గ్రామాల్లో రెండు రోజులకోసారి మాత్రమే కుళాయిల ద్వారా మంచినీళ్లు ఇస్తున్నారు. అక్టోబర్‌లోనే పరిస్థితి ఇలా ఉంటే, డిసెంబర్‌ నాటికి పరిస్థితి మరెంత తీవ్రంగా మారుతుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

నీటి సరఫరా తగ్గిపోవడంతో..

జిల్లాలో అక్కంపల్లి బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ (ఏకేబీఆర్‌), ఉదయ సముద్రం ద్వారా తాగునీటి సరఫరా తగ్గుతోంది. భువనగిరి, ఆలేరు నియోజకవర్గాల్లోని 516 గ్రామాలకు 59 ఎంఎల్‌డీల మిషన్‌ భగీరథ నీరు సరఫరా కావాల్సి ఉండగా.. ప్రస్తుతం 27 ఎంఎల్‌డీలు మాత్రమే అందుతోంది. దీంతో లోటును భర్తీ చేయడానికి స్థానిక బోర్లు, అద్దె బోర్లపై ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంది.

గ్రామాల్లో తాగునీటికి తిప్పలు

పట్టణాలతో పోలిస్తే గ్రామీణ ప్రాంతాల్లో నీటి కొరత మరింత దారుణంగా ఉంది. తుర్కపల్లి, యాదగిరిగుట్ట, రాజాపేట, ఆలేరు, మోటకొండూరు, ఆత్మకూర్‌, భువనగిరి మండలాల్లోని సుమారు 288 ఆవాసాలకు మిషన్‌ భగీరథ నీటి సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. దీంతో గ్రామాల్లో నీటి సమస్యను అధిగమించడానికి సర్పంచ్‌లు నానా యాతన పడుతున్నారు. మరోవైపు ఏకేబీఆర్‌ పరిధిలోని చౌటుప్పల్‌, నారాయణపురం, బీబీనగర్‌, పోచంపల్లి మండలాలకు 10 ఎంఎల్‌డీల నీరు అందాల్సి ఉండగా.. కేవలం 8 ఎంఎల్‌డీల (77 శాతం) సరఫరా మాత్రమే జరుగుతోంది. పైప్‌లైన్‌ లీకేజీల కారణంగా మరో 20 ఆవాసాలకు చుక్క నీరు అందక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

లీకేజీలకు అడ్డుకట్ట వేస్తేనే..

నీరు వృథా కాకుండా పైప్‌లైన్ల లీకేజీలకు అధికారులు తక్షణమే మరమ్మతులు చేపట్టాలి. కొన్ని ప్రాంతాల్లో అధికంగా, మరికొన్ని ప్రాంతాల్లో అరకొరగా నీరు సరఫరా అవుతుండటాన్ని అధికారులు చక్కదిద్దాలని ప్రజలు కోరుతున్నారు. తాగునీటి సమస్య తీవ్రంగా ఉన్న గ్రామాలకు వెంటనే ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి రాబోయే నీటి గండం నుంచి గట్టెక్కేలా ముందస్తు చర్యలు తీసుకోవాలి.

మా గ్రామంలో నీటి ఎద్దడి నివారణకు చర్యలు తీసుకోవాలి. మంచినీటి కోసం ప్రజలు రెండు రోజులుగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ఉన్న ట్యాంకులు కూడా భగీరథ నీరు, బోరు నీటితోనింపలేకపోతున్నాం. బోర్లు ఆగి ఆగిపోస్తున్నాయి. ప్రజలకు సరిపోను నీరివ్వాలి.

– ఏసిరెడ్డి మంజుల, సర్పంచ్‌, గుండ్లగూడెం

మిషన్‌ భగీరథ నుంచి

సరఫరా చేయాల్సిన నీరు : 59 ఎంఎల్‌డీ

సరఫరా అవుతున్నవి : 27 ఎంఎల్‌డీ

గ్రామాలు : 516

ఏకేబీఆర్‌ నుంచి సరఫరా చేయాల్సిన నీరు: 10 ఎంఎల్‌డీ

సరఫరా అవుతున్నవి 8 ఎంఎల్‌డీ

గ్రామాలు : 131

తీవ్రమవుతున్న తాగునీటి ఎద్దడి

ఫ డిమాండ్‌ మేరకు సరఫరా కాని నీరు

ఫ 288 గ్రామాలకు పూర్తిగా నిలిచిపోయిన మిషన్‌ భగీరథ జలాలు

ఫ సగానికి పడిపోయిన నీటి వాటా.. రెండు మూడు రోజులకోసారి మంచినీళ్లు

ఆలేరు మండలం గుండ్లగూడెం గ్రామంలో సుమారు 1500 మంది జనాభా ఉన్నారు. మొత్తం 5 బోర్లు (మూడు 5హెచ్‌పీ, 2 సింగిల్‌ఫేజ్‌ బోర్లు) ఉన్నాయి. గ్రామంలో రెండు రోజుల కోసారి మంచినీటి సరఫరా జరుగుతోంది. మిషన్‌ భగీరథ నీరు రెండు రోజులకు ఒకసారి వస్తుండగా గ్రామంలో ఉన్న రెండు ట్యాంకులు నిండడంలేదు. విద్యుత్‌ సమస్యలతో రాత్రి వేళ బోరు మోటార్లు సరిగా పనిచేయడంలేదు. లోఓల్టేజీ, షార్ట్‌సర్క్యూట్‌తో తరచూ మోటార్లు కాలిపోతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement