గత ఏడాది బిల్లులకు
కలగని మోక్షం
భువనగిరి: స్వామి వివేకానందుని జయంతిని పురస్కరించుకుని ప్రతి ఏటా యువతలోని కళాప్రతిభను వెలికితీసేందుకు నిర్వహించే ‘యువజనోత్సవాల’కు వేళైంది. జిల్లాలో నవంబర్ 4వ తేదీ నుంచి ఈ ఉత్సవాలు నిర్వహించనున్నట్లు జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి కె. ధనుంజనేయులు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఏటా జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో మూడంచెల విధానంలో ఈ పోటీలు నిర్వహిస్తుంటారు.
పోటీల షెడ్యూల్, వేదికలు ఇవే..
ఈసారి యువజనోత్సవాల పోటీల జాబితాలో నూతనంగా ‘వీధి నాటకం’ను చేర్చారు. పోటీల తేదీల వివరాలు ఇలా ఉన్నాయి.
● నవంబర్ 4వ తేదీ ఉదయం 10.30 గంటలకు డ్రాయింగ్, పోఝెట్రీ రైటింగ్, వీధి నాటకం అంశాల్లో పోటీలు ఉంటాయి. ఇవి యాదగిరిగుట్టలోని ఎంపీడీఓ కార్యాలయం వెనుక గల స్కిల్ డెవలప్‌మెంట్ ట్రైనింగ్ సెంటర్‌లో జరుగుతాయి.
● నవంబర్ 6వ తేదీ ఉదయం 9.00 గంటలకు ఫోక్ డ్యాన్స్ (గ్రూప్), ఫోక్ సాంగ్ (గ్రూప్) విభాగాల్లో పోటీలు ఉంటాయి. ఇవి చారిత్రక భువనగిరి కోట వద్ద నిర్వహిస్తారు. పోటీల్లో పాల్గొనే యువతీ, యువకుల వయస్సు 15 సంవత్సరాలు పూర్తయి, 29 ఏళ్ల లోపు ఉండాలి. గత మూడు సంవత్సరాల్లో జరిగిన యువజనోత్సవాల్లో పాల్గొన్న వారికి ఈసారి పోటీల్లో పాల్గొనేందుకు అనుమతి లేదు. పోటీల్లో పాల్గొనే అభ్యర్థులు తమ అంశాలకు సంబంధించిన సామగ్రి వెంట తెచ్చుకోవాలి.
నిధులు శూన్యం..
ఒకవైపు ఉత్సవాలను వైభవంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలు వస్తున్నా.. అందుకు అవసరమైన నిధులను మాత్రం ప్రభుత్వం విడుదల చేయలేదు. చేతిలో చిల్లిగవ్వ లేకపోవడంతో వేడుకలు ఎలా నిర్వహించాలని జిల్లా అధికారులు తలలు పట్టుకుంటున్నారు. కళాకారుల ప్రతిభ వెలుగులోకి రావడానికి ఇదో చక్కని వేదిక అయినప్పటికీ.. నిధుల లేమి వారి పాలిట ప్రతిబంధకంగా మారుతోంది.
నిధుల కొరత ప్రభావం గత ఏడాది కూడా స్పష్టంగా కనిపించింది. గత సంవత్సరం జిల్లా స్థాయిలో యువజనోత్సవాలు నిర్వహించి విజేతలను రాష్ట్ర స్థాయికి పంపేందుకు ఎంపిక చేశారు. కానీ, నిధుల కొరత కారణంగా హైదరాబాద్‌లో జరగాల్సిన రాష్ట్ర స్థాయి పోటీలనే రద్దు చేశారు. పైగా గత ఏడాది ఉత్సవాలు నిర్వహించి పంపిన బిల్లులు కూడా ఇప్పటివరకు మంజూరు కాలేదు. మరి ఈ ఏడాదైనా ప్రభుత్వం నిధులు విడుదల చేసి యువ కళాకారుల కలలకు ఊపిరి పోస్తుందో లేదో వేచి చూడాలి.
ఫ యాదగిరిగుట్ట, భువనగిరి కోట వేదికలుగా 4 నుంచి జిల్లా స్థాయి పోటీలు
ఫ ఈసారి కొత్తగా జాబితాలోకి ‘వీధి నాటకం’
ఫ 15 నుంచి 29 ఏళ్ల లోపు యువతకే అవకాశం
ఫ ఉత్సవాల నిర్వహణకు విడుదలకాని నిధులు


