యాదగిరిగుట్ట: తెలంగాణలో ఉన్న మంత్రులు కమీషన్లు, స్కాములే తప్ప.. స్కీముల గురించి పట్టించుకోవడం లేదని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్‌రెడ్డి విమర్శించారు. యాదగిరిగుట్ట మండలం వంగపల్లిలో గురువారం నిర్వహించిన ఖమ్మం–నల్లగొండ–వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. నల్లగొండ జిల్లాలో ఉన్న మంత్రులిద్దరు హెలికాప్టర్ లేనిదే పర్యటన చేస్తలేరన్నారు. మంత్రులు కమీషన్లు వచ్చే పనులు తప్ప ప్రజలకు ఉపయోగపడేవి చేయట్లేదన్నారు. మంత్రులు మూటల పంపిణీ పంచాయితీలో బిజీగా ఉన్నారన్నారు. అన్ని పథకాలను ఒకదాని తరువాత ఒకటి ఎత్తి వేస్తున్నారన్నారు. ప్రధానంగా రైతుబంధు, రైతు బీమా, కేసీఆర్ కిట్టు, కల్యాణ లక్ష్మి వంటి పథకాలు పోయాయన్నారు. కల్యాణలక్ష్మిని బంద్ చేయడానికి ప్రభుత్వమే కుట్ర చేసిందని, కేసు వేయించి ప్రజలకు వ్యతిరేకమైన ఆర్డర్ తెప్పించిందని మండిపడ్డారు.
ఐదారు గంటలే విద్యుత్ సరఫరా
కరువు ఇంత దారుణంగా ఉంటే కనీసం జిల్లాలో ఒక్కరోజు కూడా మంత్రులు వచ్చి పర్యటన చేసింది లేదన్నారు. ప్రజల్లోకి మంత్రులు రావడానికి భయపడుతున్నారన్నారు. కేసీఆర్ కాలంలో వ్యవసాయరంగంలో అద్భుతంగా నలగొండ జిల్లా వెల్లివిరిసిందని, దేశంలోనే నంబర్ వన్ జిల్లాగా రికార్డు సృష్టించిందన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో వ్యవసాయరంగం పాతాళానికి పడిపోయిందన్నారు. కేసీఆర్ ఈ రోజు ఉంటే మంచినీళ్లు, కరెంట్ సమస్య ఉండకపోవునని ప్రజలు అంటున్నారని తెలిపారు. ఈ రోజు వచ్చిన కరువు కాలం తెచ్చింది కాదని, కాంగ్రెస్ తెచ్చిందని అన్నారు. కన్నెపల్లి పంప్‌హౌజ్ ఆన్ చేసి ఉంటే గంధమల్ల, బస్వాపూర్‌లో నీళ్లు ఉండేవన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో విద్యుత్ ఐదారు గంటలే వస్తుందని, వ్యవసాయబావుల వద్ద రైతులు పడిగాపులు గాస్తున్నారన్నారు. మహబూబ్‌నగర్, నల్లగొండను ఎండబెట్టి చంద్రబాబుకు గురుదక్షిణగా సీఎం రేవంత్‌రెడ్డి నీళ్లు ఇచ్చారన్నారు. పట్టభద్రుల ఓటు నమోదు ముమ్మరంగా సాగుతోందన్నారు. సమావేశంలో ఎమ్మెల్సీ ఎన్నికల ఇన్‌చార్జి బండ నరేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు గొంగిడి సునితామహేందర్‌రెడ్డి, బూడిద భిక్షమయ్యగౌడ్, బీఆర్‌ఎస్ నేత రాకేష్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి, కల్లూరి రామచంద్రారెడ్డి, తుంగ బాలు, తోటకూరి అనురాధ పాల్గొన్నారు.
ఫ మాజీ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి


