ముఖ గుర్తింపు కాకుంటే ఇంటికే..
ఆలేరు రూరల్: ఉపాధి హామీ పథకంలో పని చేసే కూలీల ముఖ గుర్తింపు విధానం ప్రస్తుతం తలనొప్పిగా మారింది. అక్రమాలను అరికట్టే ఉద్దేశంతో ప్రభుత్వం కొత్తగా శ్రీడిజిటల్ లైవ్ యాప్‌శ్రీను ప్రవేశపెట్టింది. అయితే, కూలీల హాజరు నమోదు సమయంలో తీవ్రమైన సాంకేతిక లోపాలు ఎదురవుతున్నాయి. యాప్ సరిగా పనిచేయకపోవడం, కూలీల ముఖాలను సరిగా గుర్తించకపోవడం, మస్టర్లు డౌన్‌లోడ్ కావడానికి చాలా సమయం పడుతుండటంతో కూలీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
అక్రమాలకు తావులేకుండా..
గతంలో ఉపాధి పనుల్లో పెద్ద ఎత్తున అవినీతి, అక్రమాలు చోటుచేసుకునేవి. పనుల వద్ద నకిలీ హాజరు పట్టికలు సృష్టించడం, నేషనల్ మొబైల్ మానిటరింగ్ యాప్‌లో నకిలీ ఫొటోలు అప్‌లోడ్ చేయడం లాంటివి జరిగేవి. క్షేత్ర సహాయకులు, సీనియర్ మేట్లు తమకు తెలిసిన వ్యక్తులు పనులకు రాకపోయినా హాజరు వేయడం, కొద్దిసేపు మాత్రమే పనిచేసి వెళ్లిపోయే వారికి సైతం పూర్తి వేతనాలు అందించడం లాంటి అక్రమాలకు చెక్ పెట్టేందుకే అధికారులు ఈ కొత్త విధానాన్ని తెరపైకి తెచ్చారు.
ఇంటికి వెళ్లే సమయంలో ఎదురుచూపులు
తరచూ కొత్త యాప్‌లు వస్తుండటంతో క్షేత్రస్థాయిలో సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ వారం వచ్చిన మరో కొత్త యాప్ కారణంగా చాలా చోట్ల పని ప్రదేశాల్లో మస్టర్ డౌన్‌లోడ్ కాని పరిస్థితి నెలకొంది. ఒక్కో పని ప్రదేశంలో దాదాపు 50 నుంచి 100 మంది వరకు కూలీలు ఉంటున్నారు. పనులు పూర్తయ్యాక ఇంటికి వెళ్లాల్సిన సమయంలో అధికారులతో పాటు కూలీలు సైతం హాజరు కోసం గంటల పాటు ఎండలో వేచి ఉండాల్సి వస్తోంది. మస్టర్ డౌన్‌లోడ్ కాకపోతే అధికారులు సాంకేతిక సిబ్బందిని ఫోన్లో సంప్రదించి సమస్యను పరిష్కరిస్తున్నారు. జిల్లాలో ఉపాధి పనుల వద్ద ఎదురవుతున్న సాంకేతిక సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నట్లు డీఆర్‌డీఓ నాగిరెడ్డి తెలిపారు.
నకిలీలను పసిగట్టేది ఇలా..
కొత్త విధానంలో ఒకరికి బదులు మరొకరు హాజరు కాకుండా ఉండేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. ప్రతిరోజూ రెండుసార్లు కూలీల ఫొటోలు తీస్తారు. ఉదయం పనిలోకి రాగానే మొదటిసారి ఫొటో తీశాక, సరిగ్గా నాలుగు గంటల తర్వాత మళ్లీ రెండోసారి హాజరు నమోదు చేస్తారు. ఇలా నాలుగు గంటల వ్యవధిలో రెండుసార్లు హాజరు వేయడం వల్ల, కూలీలు మధ్యలో వెళ్లిపోకుండా పూర్తిస్థాయి పనులు చేసే అవకాశం ఉంటుంది.
ఉపాధి పథకంలో ఇలా..
మండలాల సంఖ్య 17
జాబ్ కార్డులు 2,61,745
కుటుంబాలు 14,73,487
క్రియాశీలక కూలీలు 1,27,639
సగటున హాజరు 18,026
ఉపాధి పని ప్రదేశంలో ముఖ గుర్తింపులో సాంకేతిక కారణాలతో గంటల తరబడి నిలబడాల్సి వస్తోంది. ఒక్కోసారి ముఖ గుర్తింపు కాకుంటే ఆరోజు ఇంటికి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఫొటో రాకున్నా ఉపాధి కల్పించాలి.
మోత్కూరు మల్లయ్య, కొలనుపాక
ఫ ముఖ గుర్తింపునకు డిజిటల్ లైవ్ యాప్‌లో సాంకేతిక సమస్యలు
ఫ మస్టర్లు డౌన్‌లోడ్ కాక ఇబ్బందులు
ఫ గంటల తరబడి కూలీలకు తప్పని నిరీక్షణ


