భువనగిరి: 2026–27 విద్యా సంవత్సరానికి జిల్లాలోని 24 పీఎంశ్రీ పాఠశాలల్లో 1 నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు తెలుగు–ఇంగ్లిష్ ద్విభాషా డిక్షనరీలు కొనుగోలు చేసి పంపిణీ చేయడానికి టెండర్లు ఆహ్వానిస్తున్నట్లు డీఈఓ భిక్షపతి మంగళవారం ఒకప్రకటనలో తెలిపారు. ఆసక్తిగలవారు టెండర్ ఫామ్ కోసం రూ. 5వేలు డీడీ రూపంలో చెల్లించాలని సూచించారు. అక్టోబర్ 1 నుంచి డీఈఓ కార్యాలయంలో టెండర్ ఫామ్ లభిస్తుందని పూర్తి చేసినవాటిని అదే నెల 5న సాయంత్రం 4 గంటల వరకు సమర్పించాలని కోరారు. టెండర్లను అదేనెల 6న కలెక్టరేట్‌లో తెరుస్తారని మరిన్ని వివరాలకు సెల్‌నంబర్ 9912968426 సంప్రదించాలని కోరారు.
సనాతన ధర్మ గ్రంథం అందజేత
భువనగిరి: భువనగిరి మండలం నాగిరెడ్డి పల్లి గ్రామ పరిధిలోని రమణేశ్వరంలోగల శివశక్తి షిర్డీసాయిఅనుగ్రహం మహాపీఠం ట్రస్ట్ సభ్యులు మంగళవారం కేంద్ర మంత్రులు జి. కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌లను వేర్వేరుగా కలిసి సనాతన ధర్మ గ్రంథాన్ని అందజేశారు. అనంతరం వారిని శాలువాలతో సన్మానించారు. సనాతన ధర్మ గ్రంథం 11 భాషల్లో ప్రచురిస్తున్నామని త్వరలోనే గ్రంథ ఆవిష్కరణ కార్యక్రమం ఉంటుందని ట్రస్ట్‌సభ్యులు చెప్పారు. కేంద్ర మంత్రులను కలిసిన వారిలో ట్రస్ట్ సభ్యుడు బలరాంరెడ్డి ఉన్నారు.
రేషన్ కార్డు పేదవాడి ఆత్మగౌరవానికి ప్రతీక
రాజాపేట : రేషన్‌కార్డు పేదవాడి ఆత్మగౌరవానికి ప్రతీక అని ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య అన్నారు. రాజాపేట మండలం కొత్తజాలలో నిర్మించిన పంచాయతీ భవనాన్ని, పాముకుంటలో బీటీరోడ్లు పనులను మంగళవారం ఆయన ప్రారంభించారు. సింగారంలో ప్రజల సమసల్యను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మండల కేంద్రంలో స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేసి మాట్లాడారు. రేషన్ కార్డు కేవలం సన్నబియ్యం కోసమే కాకుండా రూ. 10లక్షల వరకు ఆస్పత్రిలో ఆరోగ్య బీమా వర్తించేందుకు ఉపయోగపడుతుందన్నారు. దసరాకు నూతన పెన్షన్లు అందించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రవికిరణ్ కుమార్, ఎంపీడీఓ నాగవేణి, సర్పంచులు కోయ మధు, రంగ నరేష్ గౌడ్, కొండ ప్రమీల పాండరి, ఠాకూర్ లావణ్య ధర్మేందర్ సింగ్, మార్కెట్ డైరెక్టర్ సిలివేరు బాలరాజు గౌడ్, పీఏసీఎస్ చైర్మన్ మహేందర్ గౌడ్, ఆత్మ డివిజన్ కమిటీ చైర్మన్ సుధాకర్, నాయకులు పెంటయ్య గౌడ్, ఇంజ నరేష్ పాల్గొన్నారు.


