భువనగిరిటౌన్ : భువనగిరి పట్టణం నుంచి అర్బన్ కాలనీ వైపు నిత్యం రాకపోకలు సాగించే కాలనీవాసులు, వాహనదారులకు పది రోజుల పాటు ప్రయాణ ఇబ్బందులు ఎదురుకానున్నాయి. భువనగిరి రైల్వే స్టేషన్ సమీపంలో అర్బన్ కాలనీకి వెళ్లే ప్రధాన రహదారిలోని లెవల్ క్రాసింగ్ గేటును మరమ్మతుల నిమిత్తం మంగళవారం నుంచి అధికారులు పూర్తిగా మూసివేశారు.
10 రోజుల పాటు రైల్వే ట్రాక్ పనులు
సికింద్రాబాద్ – కాజీపేట ప్రధాన మార్గంలోని పగిడిపల్లి – భువనగిరి రైల్వే స్టేషన్ల మధ్య (కిలోమీటర్ 239/19–21 వద్ద ఉన్న) లెవల్ క్రాసింగ్ నంబర్ 30టీ గేటు అత్యంత కీలకమైనది. ఈ మార్గంలో రైలు పట్టాల పటిష్టతతో పాటు రోడ్డు మరమ్మతు పనులను దక్షిణ మధ్య రైల్వే ఇంజనీరింగ్ విభాగం చేపట్టింది. ఈ పనుల కారణంగా మంగళవారం నుంచి అక్టోబర్ 8వతేదీ సాయంత్రం 7 గంటల వరకు ఈ గేటు గుండా ఎలాంటి వాహన రాకపోకలను అనుమతించబోమని ఘట్‌కేసర్ సీనియర్ సెక్షన్ ఇంజనీర్ వెల్లడించారు.
ప్రత్యామ్నాయ మార్గాలు ఇవే..
ప్రధాన మార్గంలో రాకపోకలు నిలిచిపోవడంతో ప్రయాణికుల కోసం అధికారులు ప్రత్యామ్నాయ మార్గాలను సూచించారు.
● అర్బన్ కాలనీ వైపు వెళ్లే నాలుగు చక్రాల వాహనాలు, ఆటోలు, భారీ వాహనాలు బస్వాపురం వైపు ఉన్న రైల్వే అండర్ పాస్ బ్రిడ్జి మీదుగా వెళ్లాల్సి ఉంటుంది.
● బైక్‌లు, స్కూటర్లపై వెళ్లే ప్రయాణికులు భువనగిరి రైల్వే స్టేషన్ దాటిన తర్వాత అందుబాటులో ఉన్న చిన్న అండర్ పాస్ బ్రిడ్జి గుండా రాకపోకలు సాగించవచ్చు.
ఫ పది రోజుల పాటు తాత్కాలికంగా మూసివేత
ఫ ట్రాక్ పటిష్టత, రోడ్డు మరమ్మతుల దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే నిర్ణయం
ఫ అండర్ పాస్ బ్రిడ్జిల ద్వారా ప్రయాణాలకు సూచన


