భువనగిరి, రామన్నపేట: రాష్ట్ర ప్రభుత్వం దసరా నాటికి కొత్తగా చేయూత పింఛన్లు మంజూరు చేయనున్న నేపథ్యంలో జిల్లాలో విచారణ ప్రక్రియ వేగవంతమైంది. ఈ నెల 15 వరకు అర్హుల నుంచి కొత్తగా దరఖాస్తులు స్వీకరించిన విషయం తెలిసిందే. గడువు ముగిసిన తర్వాత పరిశీలిస్తే జిల్లా వ్యాప్తంగా 18,308 అర్జీలు వచ్చాయి. వీటిలో అత్యధికంగా వితంతువులే 8,478 మంది పింఛన్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తుదారుల్లో 35 నుంచి 50 సంవత్సరాల వయస్సు కలిగిన మహిళలే ఎక్కువగా ఉండటం గమనార్హం. వీరే కాకుండా ఒంటరి మహిళలు 917 మంది పింఛన్ కోసం ఎదురుచూస్తున్నారు. దివ్యాంగులు 4410, చేనేత 1573, కల్లుగీత కార్మికులు 2930 మంది దరఖాస్తులు చేసుకున్నారు.
క్షేత్రస్థాయి పరిశీలన వేగవంతం
జిల్లాలోనే అత్యధికంగా వలిగొండ మండలం నుంచి 1,438 దరఖాస్తులు రాగా, అతి తక్కువగా మోత్కూరు మండలం నుంచి 310 దరఖాస్తులు నమోదయ్యాయి. అందిన దరఖాస్తులను ఎంపీడీఓ, మున్సిపల్ కార్యాలయాల్లోని సిబ్బంది ఇప్పటికే ఆన్‌లైన్‌లో నమోదు చేశారు. ప్రస్తుతం మండల స్థాయి అధికారులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి దరఖాస్తుదారుల ఇళ్లకు వెళ్లి నేరుగా విచారణ చేపడుతున్నారు.
నిశితంగా తనిఖీ
లబ్ధిదారుల రేషన్ కార్డు, కుల, ఆదాయ వివరాలు, కుటుంబంలో ఎవరైనా ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులు ఉన్నారా?.. 7.5 ఎకరాల కంటే ఎక్కువ వ్యవసాయ భూమి ఉందా? ఇంట్లో వేరే ఎవరైనా పింఛన్ పొందుతున్నారా? అనే అంశాలను నిశితంగా తనిఖీ చేస్తున్నారు. నాలుగు చక్రాల వాహనం ఉన్నా, పరిమితికి మించి భూమి ఉన్నా దరఖాస్తులను తిరస్కరిస్తున్నారు. వివరాలన్నింటినీ నేరుగా చేయూత యాప్‌లో నమోదు చేస్తూ దరఖాస్తుదారుల ఫొటోలను అప్‌లోడ్ చేస్తున్నారు. ఈ విచారణ ప్రక్రియను ఈ నెలాఖరు నాటికి పూర్తి చేసి, అర్హులైన ప్రతి ఒక్కరికీ దసరా పండుగ నాటికి నూతన పింఛన్లను అందించేలా అధికారులు చర్యలు వేగవంతం చేశారు.
ఫ వితంతు దరఖాస్తులే అధికం
ఫ ముమ్మరంగా క్షేత్రస్థాయి విచారణ
ఫ మండల స్థాయి అధికారులతో ప్రత్యేక బృందాల ఏర్పాటు
ఫ చేయూత యాప్‌లో
దరఖాస్తుదారుల వివరాలు నమోదు
ఫ దసరా నాటికి కొత్త పింఛన్ల
మంజూరుకు చర్యలు


