సాక్షి, యాదాద్రి: ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో చోటుచేసుకుంటున్న సాంకేతిక లోపాలు, సాఫ్ట్‌వేర్ అనువాద పొరపాట్లు గ్రామీణ ప్రాంత ప్రజలకు తీవ్ర ఇబ్బందులు సృష్టిస్తున్నాయి. ఊర్లలో ఓటర్లు భౌతిక డిక్లరేషన్ ఫామ్‌లను సరిగ్గా నింపి ఇచ్చినప్పటికీ, సిస్టమ్‌లోని ఆటో–ట్రాన్స్‌లేషన్ లోపాల కారణంగా వేలాది మందికి నోటీసులు జారీ అవుతుండటం తీవ్ర ఆందోళనకు దారితీస్తోంది.
పేర్ల అనువాదంలో దొర్లిన తప్పులు
ప్రజలు సర్వే ఫామ్‌లలో తమ పేర్లను తెలుగులో స్పష్టంగా రాసిచ్చినప్పటికీ, పాత రికార్డుల్లోని ఇంగ్లిష్ పేర్లను ఆటోమేటిక్ సాఫ్ట్‌వేర్ ద్వారా తెలుగులోకి తర్జుమా చేయడం వల్ల తీవ్ర వ్యత్యాసాలు వచ్చాయి. ఇంటిపేర్లు మారడం, పేర్లలో ఒత్తులు, దీర్ఘాలు ఎగిరిపోవడం (ఉదాహరణకు ‘చంద్రయ్య’ అనే పేరులో ‘య’ వత్తు దూరంగా జరగడం) వంటి చిన్న చిన్న తప్పులను కూడా సాఫ్ట్‌వేర్ తేడాగా గుర్తించి ఆటోమేటిక్‌గా నోటీసులను జనరేట్ చేసింది.అధికారులు క్షేత్రస్థాయిలో సేకరించిన కొత్త భౌతిక డిక్లరేషన్ ఫామ్‌ల డేటాను పక్కనబెట్టి, పాత ఆటోమేషన్ సిస్టమ్‌నే వాడటంతో సమస్య మొదటికి వచ్చింది.
క్షేత్రస్థాయిలో సర్టిఫికెట్ల రగడ
ఎన్నికల సంఘం ఓటరు గుర్తింపు ధ్రువీకరణ కు 14 రకాల కార్డుల్లో ఒకటి ఆధారంగా చూపవచ్చని తెలిపింది. క్షేత్రస్థాయి అధికారులు మాత్రం కులం సర్టిఫికెట్ తీసుకురావాలని ఒత్తిడి చేస్తుండటంతో కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తోంది.
97,102 మందికి నోటీసులు
ఆలేరు, భువనగిరి నియోజకవర్గాల వ్యాప్తంగా 4.59 లక్షల మందికి పైగా ఓటర్లున్నారు. వీరిలో 97,102 మందికి నోటీసులు జారీ చేసే ప్రక్రియను ప్రారంభించారు. ఇప్పటివరకు 77,518 మందికి నోటీసులు అందజేశారు.కేవలం 15,000 మందికి మాత్రమే హియరింగ్ ప్రక్రియ పూర్తయ్యింది.
సమస్యకు పరిష్కార మార్గాలు
పాత ఇంగ్లిష్–తెలుగు ఆటో–ట్రాన్స్‌లేషన్‌ను నిలిపివేసి, ఏఐ ఆధారిత వాయిస్, తెలుగు టైపింగ్ టూల్స్ ద్వారా డేటాను సరిచేయాలి. ఓటర్లు బీఎల్‌ఓలకు అందించిన భౌతిక డిక్లరేషన్ ఫామ్‌ల ఆధారంగానే సిస్టమ్‌లో మార్పులు చేపట్టాలి. సాఫ్ట్‌వేర్ పంపే నోటీసులపైనే ఆధారపడకుండా, నిజమైన దొంగ ఓట్లను అరికట్టేందుకు బీఎల్‌ఓలు, ఉన్నతాధికారులు స్వయంగా క్షేత్రస్థాయి విచారణ జరిపి సవరణలు చేయాలి.
ఫ ఆటో–ట్రాన్స్‌లేషన్ లోపాల వల్ల
వేలాది మందికి నోటీసులు
ఫ సర్టిఫికెట్ల కోసం మీసేవ కేంద్రాలకు పరుగులు
ఫ 97 వేల మందిపై నోటీసుల భారం
ఫ భౌతిక డిక్లరేషన్ ఫామ్‌ల ఆధారంగా
మార్పులు చేయాలని వినతి


