యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి జన్మ నక్షత్రం స్వాతిని పురస్కరించుకొని ఆలయంలో శతఘటాభిషేకం పూజను ఆలయ అర్చకులు మంగళవారం పాంచరాత్ర ఆగమశాస్త్రానుసారంగా నిర్వహించారు. వేకువజామునే ఆలయాన్ని తెరచిన అర్చకులు శ్రీస్వామి అమ్మవార్లకు సుప్రభాత సేవను జరిపించి మేల్కొల్పారు. అనంతరం ఆలయ ముఖ మండపంలో స్వాతి హోమంతో పాటు బంగారు, వెండి కలశాలలో నింపిన శుద్ధ జలాలు, సుగ్రంధ పరిమళాలు వెదజల్లే పంచామృతాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజల అనంతరం కలశాలతో స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తులకు శతఘటాభిషేకం పూజ చేపట్టారు. అనంతరం సహస్ర నామార్చన, కుంకుమార్చన, ప్రథమ ప్రాకార మండపంలో గజవాహన సేవ, నిత్య కల్యాణం, బ్రహ్మోత్సవం వంటి పూజలు చేశారు. సాయంత్రం వేళ జోడు సేవలను ఆలయ తిరు, మాడ వీధుల్లో ఊరేగించారు.


