పుష్కరకాల నిరీక్షణకు తెర | - | Sakshi
Sakshi News home page

పుష్కరకాల నిరీక్షణకు తెర

Aug 7 2026 4:05 AM | Updated on Aug 7 2026 4:05 AM

కచ్చితత్వంతో పరీక్షలు

ఆన్‌లైన్‌ స్లాట్‌ బుకింగ్‌ తప్పనిసరి

దండుమల్కాపూర్‌లో రాష్ట్రంలోనే తొలి ఆటోమేటెడ్‌ వెహికిల్‌ ఫిట్‌నెస్‌ సెంటర్‌

సాక్షి, యాదాద్రి: రాష్ట్రంలోనే మొదటి ఆటోమేటెడ్‌ వెహికిల్‌ ఫిట్‌నెస్‌ సెంటర్‌ (ఏటీసీ) యాదాద్రి భువనగిరి జిల్లాలో అందుబాటులోకి వస్తోంది. ఇకపై వాహనాల ఫిట్‌నెస్‌ను అంచనా వేసే మాన్యువల్‌ విధానానికి స్వస్తి పలికి, డిజిటల్‌ పరికరాలతో కచ్చితత్వంతో పరీక్షించనున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో మంజూరైన ఈ ప్రాజెక్టు సుమారు పుష్కరకాలం నిరీక్షణ తర్వాత చౌటుప్పల్‌ మండలం దండుమల్కాపూర్‌లో సాకారం అవుతోంది. ఈనెల 17 నుంచి ఈ కేంద్రం పూర్తిస్థాయిలో సేవలు అందించనుంది.

12 ఏళ్ల నిరీక్షణకు తెర

వాస్తవానికి ఈ ప్రాజెక్ట్‌ 2014లోనే ప్రారంభం కావాల్సి ఉంది. కానీ, అనేక పరిపాలనాపరమైన జాప్యాల కారణంగా ఏళ్ల తరబడి ముందుకు సాగలేదు. ఎట్టకేలకు 12 సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఈ ప్రాజెక్టు పట్టాలెక్కింది. చౌటుప్పల్‌ మండలం దండుమల్కాపూర్‌ వద్ద ప్రభుత్వం కేటాయించిన ఎనిమిదిన్నర ఎకరాల స్థలంలో రూ. 10 కోట్ల అంచనా వ్యయంతో దీనిని నిర్మించారు. ప్రస్తుతం యాదాద్రి భువనగిరి జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో ఈ కేంద్రం నడుస్తుంది.

జర్మనీ నుంచి యంత్రాలు

కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా కేవలం ఆరు రాష్ట్రాల్లో మాత్రమే ఈ తరహా అత్యాధునిక కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్‌ (వైజాగ్‌), కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌ తదితర రాష్ట్రాలు ఉన్నాయి. తెలంగాణలో ఇటువంటి అత్యాధునిక వసతి కలిగిన మొదటి కేంద్రం ఇదే. వాణిజ్య వాహనాలకు నాణ్యత పరీక్షలు నిర్వహించేందుకు జర్మనీ నుంచి ప్రత్యేక యంత్రాలను దిగుమతి చేసుకున్నారు.

కమర్షియల్‌ వాహనాలకే ఫిట్‌నెస్‌

జిల్లాలోని సుమారు 40 వేల వాణిజ్య వాహనాలకు ఇక్కడ ఫిట్‌ నెస్‌ పరీక్షలు నిర్వహిస్తారు. వీటిలో లారీలు, టిప్పర్లు, గూడ్స్‌ క్యారియర్లు, స్కూల్‌ బస్సులు, మ్యాక్సీ క్యాబ్‌లు, ఆటోలు, తుఫాన్‌ వాహనాలు, ఎల్లో ప్లేట్‌ నంబర్‌ బోర్డు కలిగిన వాహనాలు ఉంటాయి. ద్విచక్ర వాహనాలు, సొంత కార్లు వంటి వ్యక్తిగత వాహనాలకు ఈ పరీక్షల నుంచి మినహాయింపు ఉంటుంది.

ఇప్పటివరకు అధికారులు స్వయంగా మాన్యువల్‌ విధానంలో ఫిట్‌నెస్‌ పరీక్షలు నిర్వహించేవారు. ఇకపై ప్రతి వాహనాన్ని యంత్రాల సహాయంతో పరీక్షిస్తారు. ప్రధానంగా ఐదు రకాల పరీక్షలు ఉంటాయి.

హెడ్‌లైట్ల సామర్థ్యం: వెలుతురు, డిమ్‌, బ్రైట్‌ కండిషన్‌, ఇండికేటర్ల పనితీరు.

ఇంజన్‌ సామర్థ్యం: ఇంజన్‌ కండిషన్‌ , పొగ (కాలుష్య) నిబంధనల పరీక్ష

సస్పెన్షన్‌ టెస్ట్‌: వాహన సస్పెన్షన్‌, షాక్‌ అబ్జార్బర్ల స్థితిగతులు

టైర్ల కండిషన్‌: టైర్ల అరుగుదల, గ్రిప్‌, రోడ్డుపై ప్రయాణించే భద్రతా ప్రమాణాలు

బ్రేకింగ్‌ ఎఫీషియన్సీ: బ్రేకుల పనితీరు, ఆకస్మికంగా ఆపే సామర్థ్యం నిర్ధారణ

ఫ రూ. 10 కోట్లతో ఏర్పాటు

ఫ జర్మన్‌ సాంకేతికతతో అత్యాధునిక యంత్రాలు

ఫ మాన్యువల్‌ తనిఖీలకు స్వస్తి.. డిజిటల్‌ విధానంలో ఐదు రకాల పరీక్షలు

ఫ పాత రుసుములతోనే సేవలు

ఫ 17 నుంచి పూర్తిస్థాయిలో అందుబాటులోకి

వాహనదారులు రవాణా శాఖ ఆన్‌లైన్‌ పోర్టల్‌ ద్వారా ముందస్తుగా స్లాట్‌ బుక్‌ చేసుకోవాలి. నిర్ణీత రుసుము చెల్లించి సెంటర్‌కు రావాల్సి ఉంటుంది. ఫిట్‌నెస్‌ పరీక్షల రుసుములలో ఎలాంటి పెంపు లేదు, పాత పద్ధతిలోనే వసూలు చేస్తాం. రాష్ట్ర రవాణా కమిషనర్‌ ఆదేశాల మేరకు, కొత్త యంత్రాలు అమర్చేలోపు వాహనదారులకు ఈ ప్రాంగణంపై అవగాహన కల్పించేందుకు తాత్కాలికంగా మ్యానువల్‌ తనిఖీలు ప్రారంభించాం.

– సంగెం నరేష్‌, డీటీఓ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement