మడిగెల నిర్మాణంపై మున్సిపల్‌ కౌన్సిల్‌లో రగడ | - | Sakshi
Sakshi News home page

మడిగెల నిర్మాణంపై మున్సిపల్‌ కౌన్సిల్‌లో రగడ

Aug 7 2026 4:05 AM | Updated on Aug 7 2026 4:05 AM

భువనగిరిటౌన్‌ : తీవ్ర వాదోపవాదాలు, ప్రతిపక్షాల నిరసనలు, పోలీసుల బందోబస్తు నడుమ భువనగిరి మున్సిపల్‌ కౌన్సిల్‌ సాధారణ సమావేశం గురువారం వాడివేడిగా సాగింది. మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ తంగెళ్లపల్లి శ్రీవాణి అధ్యక్షతన జరిగిన సమావేశంలో 15 ఎజెండా అంశాలను ప్రవేశపెట్టారు. వివాదాస్పదంగా మారిన మడిగెల నిర్మాణ ప్రతిపాదనను తాత్కాలికంగా పక్కనబెట్టి, మిగిలిన అంశాలకు కౌన్సిల్‌ ఆమోదం తెలిపింది. అయితే, కౌన్సిల్‌ సమావేశ మందిరంలో ఎన్నడూ లేని విధంగా పోలీసులు వచ్చి కూర్చోవడంపై ప్రతిపక్ష కౌన్సిలర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. డబుల్‌ బెడ్‌రూం, మడిగెల అంశాలపై ఆందోళన జరిగే అవకాశం ఉందన్న ముందస్తు సమాచారంతోనే పోలీసులు వచ్చినట్లు తెలుస్తుండగా.. అధికార పార్టీ సభ్యులు మాత్రం ప్రతి శాఖకు ఇచ్చిన ఆహ్వానంలో భాగంగానే వారు వచ్చినట్లు చెబుతున్నారు.

హద్దులు తేలేవరకు నిర్మాణాలు వద్దు

రామస్వామి హోటల్‌ సమీపంలోని మున్సిపల్‌ ఖాళీ స్థలంలో దుకాణ సముదాయాల నిర్మాణానికి ముందు, ఆ స్థలానికి సంబంధించిన పక్కా సరిహద్దులను సేకరించాలని కౌన్సిలర్లు పాశం అమర్నాథ్‌, జంగిటి వినోద్‌కుమార్‌ పట్టుబట్టారు. దీనిపై చైర్‌పర్సన్‌ స్పందిస్తూ.. తమ వార్డులోని స్థలాన్ని ఎవరూ ఆక్రమించలేదని, అనవసర ఆరోపణలు చేయవద్దన్నారు.ఈ వివాదం తీవ్రరూపం దాల్చ డంతో మున్సిపల్‌ కమిషనర్‌ కె.చంద్రప్రకాశ్‌ రెడ్డి జోక్యం చేసుకొని.. కౌన్సిలర్ల సమక్షంలో క్షేత్రస్థాయి పరిశీలన పూర్తి చేసి, హద్దులు నిర్ధారించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు. దీంతో వివాదం సద్దుమణిగింది.

బడ్జెట్‌ పెంపునకు ఆమోదం

బాబు జగ్జీవన్‌ రామ్‌ భవన్‌ మౌలిక వసతుల అంచనా వ్యయాన్ని ఇంజనీర్లు మొదట రూ.7.60 లక్షలుగా నిర్ణయించి, ఆ తర్వాత రూ.6 లక్షలకు తగ్గించడంపై కౌన్సిలర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో నిధులను రూ.7.60 లక్షలకు పెంచుతున్నట్లు చైర్‌పర్సన్‌ ప్రకటించారు. తీజ్‌ పండుగ నిర్వహణ నిధులను రూ.2.50 లక్షలకు పెంచాలని కాంగ్రెస్‌ సభ్యురాలు సుమయ్య తబస్సుం అహ్మద్‌ కోరగా కౌన్సిల్‌ ఏకగ్రీవంగా అంగీకరించింది.

పక్షపాత వైఖరిపై బీఆర్‌ఎస్‌ నిరసన.. వాకౌట్‌

పట్టణంలో కోతులు, వీధికుక్కల బెడదను అదుపు చేయడంలో పాలకపక్షం విఫలమైందని బీఆర్‌ఎస్‌ పార్టీ కౌన్సిల్‌ ఫ్లోర్‌ లీడర్‌ చెన్న స్వాతి, కౌన్సిలర్‌ నాకోటి నగేష్‌ మండిపడ్డారు. పారిశుద్ధ్య సామగ్రి కొనుగోళ్లలో అక్రమాలు జరిగాయని, ప్రతిపక్ష వార్డుల్లో బోర్లు వేయకుండా పక్షపాతం చూపుతున్నారంటూ సభ నుంచి వాకౌట్‌ చేశారు. ఈ కార్యక్రమంలో వైస్‌ చైర్మన్‌ పోతంశెట్టి మంజుల, కమిషనర్‌ చంద్రప్రకాశ్‌ రెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

ఫ భువనగిరి మున్సిపల్‌ పాలకవర్గ తీరుపై మండిపడిన ప్రతిపక్షాలు

ఫ బీఆర్‌ఎస్‌ సభ్యుల వాకౌట్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement