సాక్షి, యాదాద్రి: ఘట్కేసర్ నుంచి వంగపల్లి వరకు ఎంఎంటీఎస్ పనులను 2028 మార్చి 28 నాటికి పూర్తి చేస్తామని దక్షిణ మధ్య రైల్వే అడిషనల్ డివిజనల్ మేనేజర్ ముత్యాల నాయుడు వెల్లడించారు. గురువారం జిల్లాలోని యాదాద్రి(రాయగిరి) రైల్వేస్టేషన్‌ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన అమృత్ పథకంలో భాగంగా యాదాద్రి స్టేషన్ వద్ద కొనసాగుతున్న పునర్నిర్మాణ పనులను పరిశీలించారు. ప్రస్తుతం భువనగిరి రైల్వే స్టేషన్, రాయగిరి రైల్వే స్టేషన్‌లో విస్తరణ పనులు జరుగుతున్నాయన్నారు. ప్రస్తుతం ఉన్న రైల్వే ట్రాక్ వెంట జరిగే అదనపు ట్రాక్ నిర్మాణ పనులు నెమ్మదిగా చేస్తామన్నారు. భవిష్యత్తులో కాజీపేట వరకు ఫోర్ లేన్, ట్రాక్ పనులు కూడా చేపడతామని ఆయన స్పష్టం చేశారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట భక్తులను దృష్టిలో ఉంచుకుని రాయగిరి వద్ద అన్ని హంగులతో యాదాద్రి స్టేషన్ ను నిర్మిస్తున్నట్లు తెలిపారు. మరో మూడు నెలల్లో ఈ యాదాద్రి రైల్వే స్టేషన్ పనులు పూర్తి చేసి, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతులమీదుగా ప్రారంభోత్సవం చేయాలని భావిస్తున్నట్లు తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మెరుగైన వసతులు కల్పించేలా పనులు పూర్తి చేస్తామన్నారు. అంతకుముందు యాదాద్రి స్టేషన్‌లో వర్షం నీరు స్టేషన్ రూప్ పై నుంచి చుక్కలుగా పడడం చూసి సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. స్టేషన్ పనుల్లో నాణ్యత లోపాలు ఉండవద్దని, పూర్తి ప్రమాణాలతో చేపట్టాలని ఆయన ఆదేశించారు.
ఫ అడిషనల్ డివిజనల్ మేనేజర్ ముత్యాల నాయుడు


