సరికొత్త ఆవిష్కరణలతో చేనేత కళకు జీవం
ఈ చిత్రంలోని వ్యక్తి పోచంపల్లికి చెందిన రాపోలు శ్రీనివాస్.
8వ తరగతిలోనే చదువు మానేశాడు. 16 ఏళ్ల వయస్సులో మగ్గం నేయడం ప్రారంభించాడు. 30 ఏళ్లుగా చేనేతలో అనేక ఒడిదొడుకులను ఎదుర్కొని చేనేత రంగంలో రాణిస్తున్నాడు. తాను ఉపాధి
పొందుతూనే మరో 70 కుటుంబాలకు ఉపాధి కల్పిస్తున్నాడు.
50 మగ్గాలను నిర్వహిస్తూ ఆధునిక పద్ధతులు పాటిస్తూ డిమాండ్‌కు
తగ్గ వస్త్రాలను రూపొందిస్తున్నాడు. వస్త్రోత్పత్తులను
తానే స్వయంగా మార్కెటింగ్ చేసుకుంటున్నాడు.
భూదాన్‌పోచంపల్లి: అగ్గిపెట్టెలో పట్టేంత చీరను నేసిన ఘనకీర్తి మన నేతన్నలది. ప్రపంచ ప్రసిద్ధి గాంచిన పోచంపల్లి కేంద్రంగా చేనేత పరిశ్రమ ఏర్పడి సరిగ్గా 70 ఏళ్లు పూర్తవుతోంది. ఈ ఏడు దశాబ్దాల కాలంలో చేనేత పరిశ్రమ అనేక ఆర్థిక ఆటుపోట్లను, కరోనా లాంటి తీవ్ర సంక్షోభాలను ఎదుర్కొని నిలబడింది. మారుతున్న కాలానికి అనుగుణంగా నేతన్నలు సరికొత్త ఆవిష్కరణలతో చేనేత కళకు జీవం పోస్తూ పరిశ్రమను నిలుపుకొస్తున్నారు. రాష్ట్రంలో వ్యవసాయం తర్వాత అత్యధిక మందికి జీవనాధారంగా నిలుస్తున్న రంగం చేనేత కావడం విశేషం. ఉమ్మడి జిల్లాలో 35వేలకుగా కుటుంబాలు చేనేత రంగంపై ఆధారపడి జీవనం సాగిస్తున్నాయి.
చేనేతలో వినూత్న ఆవిష్కరణలు
పోచంపల్లి వస్త్రాలకు 2003లో కేంద్ర ప్రభుత్వం శ్రీజియోగ్రాఫికల్ ఇండికేషన్ రిజిస్ట్రీ (పేటెంట్) హక్కులను కల్పించింది. ఇందులో పోచంపల్లి చేనేత 11 రకాల డిజైన్లకు రిజర్వేషన్లతో పాటు చేనేత వస్త్రాలైన చీరలు, రుమాలు, కార్పేట్, బెడ్‌షీట్స్, మ్యాట్స్‌కు పేటెంట్ హక్కు కల్పించింది. దారం పోగుపై డిజైన్ వేసి ‘టై అండ్ డై’ పద్ధతిలో వస్త్రాలు నేయడం ఇక్కడి చేనేత కళాకారుల ప్రత్యేకత. 1956లో పోచంపల్లి కేంద్రంగా చేనేత పరిశ్రమ ఏర్పడిన తొలినాళ్లలో పాన్‌పటోలా, రాజస్థాన్, నారీకుండీ, ఏనుగు, చిలుక, అంబారీ, సీతాగీతా లాంటి సాంప్రదాయ చేనేత డిజైన్‌లతో వస్త్రాలను నేసేవారు. కానీ ప్రస్తుతం ట్రెండ్ మారింది. జాతీయ, అంతర్జాతీయ మార్కెట్ ప్రమాణాలకు అనుగుణంగా రాజ్‌కోట్ డిజైన్‌లతోనే మడ్తాస్ చీరలు, సబర్‌పురి ఇక్కత్, బాందినీ ఇక్కత్ చీరలు, ట్విల్ చీరలు, పైతానీ, నారీకుంజీ, నవరత్న్ పటోల, పుల్ టిష్యూ, పోచంపల్లి ఇక్కత్‌లోనే గద్వాల, కంచి, ధర్మవరం డిజైన్లు కల్గిన వినూత్నంగా వస్త్రాలను రూపొందిస్తున్నారు. పోచంపల్లి ఇక్కత్ బ్రాండ్‌పైనే జిల్లాలో ప్రధానంగా భూదాన్‌పోచంపల్లితో పాటు చౌటుప్పల్, కొయ్యలగూడెం, నారాయణపురం, పుట్టపాక, రామన్నపేట, రాజాపేట, మోత్కూర్, గుండాల, ఆలేరు, పుట్ట పాక, గట్టుప్పల, చండూర్, నల్లగొండ తదితర ప్రాంతాలలో పట్టు, కాటన్ వస్త్రాలు తయారు చేస్తున్నారు. కరోనా తరువాత వందలాది మంది యువత వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్ట్రాగామ్ ద్వారా ఆన్‌లైన్ వస్త్ర వ్యాపారం చేస్తూ ఉపాధి పొందుతున్నారు.
పరిశ్రమ ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు
● గడిచిన ఏడాది కాలంలో కిలో నూలు ధర రూ.4 వేల నుంచి రూ.6 వేలకు పెరిగింది. దీనికి అనుగుణంగా చీరల ధరలు పెంచలేక కార్మికులు గిట్టుబాటు కోల్పోతున్నారు.
● నూలు, ముడిసరుకుపై కేంద్ర ప్రభుత్వం విధించిన 5శాతం జీఎస్టీ భారంగా మారింది.
● సూరత్, గుజరాత్ మిల్లుల్లో ఇక్కత్ డిజైన్లను ప్రింట్ చేసి తక్కువ ధరకు విక్రయిస్తుండటంతో చేనేత రంగానికి తీవ్ర నష్టం వాటిల్లుతోంది.
● చేనేత కార్మికులు తయారు చేసిన వస్త్రోత్పత్తులను మార్కెటింగ్ చేసుకోవడానికి సరైన సదుపాయాలు, అవగాహన లేక స్టాక్ నిలిచిపోయి, కార్మికులకు చేతినిండా పనికల్పించలేకపోతున్నారు.
● నూలుపై గతంలో ఉన్న 40శాతం సబ్సిడీని ఎత్తివేయడం, నేతన్న చేయూత పథకం సరిగ్గా అమలు కాకపోవడం నేత కార్మికులను కుంగదీస్తోంది.
చేనేత కార్మికుల విజ్ఞప్తులు ఇవే..
u నూలు ధరలను నియంత్రించి, 40 శాతం సబ్సిడీతో నేరుగా డిపోల ద్వారా నూలు అందించాలి.
u ధాన్యం కొనుగోలు తరహాలోనే నేతన్నలు నేసిన వస్త్రాలను ప్రభుత్వమే ‘టెస్కో’ ద్వారా పూర్తిగా కొనుగోలు చేయాలి.
u కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల్లో పట్టు చీరలను, స్కూల్ యూనిఫారమ్‌లకు చేనేత దుస్తులను ప్రభుత్వమే సరఫరా చేయాలి.
u చేనేత వస్త్రాలపై జీఎస్టీని రద్దు చేసి, నేత కార్మికులకు జీరో వడ్డీ రుణాలు అందించాలి.
u ఎగ్జిబిషన్‌లలో చేనేత వస్త్రాలను అమ్ముకునేందుకు స్టాల్స్ అవకాశం కల్పించాలి.
ఉమ్మడి జిల్లాలో చేనేత,
మరమగ్గాల వివరాలు ఇలా..
చేనేత మర
యాదాద్రి భువనగిరి 7719 2240
నల్లగొండ 2700 4023
సూర్యాపేట 125 51
అంతర్జాతీయ స్థాయిలో
ఆకట్టుకుంటున్న ఇక్కత్ వస్త్రాలు
ఆన్‌లైన్ వస్త్ర వ్యాపారం చేస్తూ
ఉపాధి పొందుతున్న చేనేత యువత
అయినా ఒడిదుడుకుల్లో చేనేత రంగం
నేడు జాతీయ చేనేత దినోత్సవం


