రామగిరి(నల్లగొండ) : అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మైనార్టీ డిక్లరేషన్ హామీని తక్షణమే పూర్తిస్థాయిలో అమలు చేయాలని జమియత్ ఉలెమా రాష్ట్ర అధ్యక్షుడు మౌలానా సయ్యద్ ఎహసానుద్దీన్ ఖాస్మీ రషాదీ డిమాండ్ చేశారు. మైనార్టీల రాజ్యాంగ, ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణపై గురువారం నల్లగొండలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మైనార్టీల కోసం వెంటనే సబ్–ప్లాన్‌ను అమలు చేయాలన్నారు. ప్రకటించిన రూ.4,000 కోట్ల వార్షిక బడ్జెట్‌ను పూర్తిగా కేటాయించి, పారదర్శకంగా ఖర్చు చేయాలని కోరారు. ఇమామ్‌లు, ముఅజ్జిన్‌లకు గౌరవ వేతనాలు పెంచుతామన్న హామీని నెరవేర్చాలన్నారు. ప్రత్యేక డీఎస్సీ ద్వారా ఉర్దూ ఉపాధ్యాయుల నియామక ప్రక్రియను ప్రారంభించాలని కోరారు. వక్ఫ్ ఆస్తుల ఆక్రమణలను తొలగించి, సమగ్ర సర్వే ద్వారా డిజిటల్ రికార్డులను రూపొందించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ పరిధిలోని కార్పొరేషన్లు, బోర్డులు, అథారిటీలు, సలహా కమిటీలలో మైనార్టీలకు జనాభా ప్రాతిపదికన ప్రాతినిధ్యం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. రాబోయే రాజ్యసభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి ఒక సమర్థుడైన ముస్లిం ప్రతినిధిని నామినేట్ చేయాలన్నారు. మైనార్టీల విద్యా, ఆర్థిక, సామాజిక అభివృద్ధికి ప్రకటించిన పథకాలన్నింటినీ ఆలస్యం లేకుండా అమలు చేయాలని కోరారు.హామీల అమలులో ప్రభుత్వం విఫలమైతే జమియత్ ఉలెమా ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా శాంతియుత నిరసన కార్యక్రమాలు చేపడతామని స్పష్టం చేశారు. సమావేశంలో జమియత్ ఉలేమా రాష్ట్ర ఉపాధ్యక్షుడు మౌలానా మఖ్దూమ్, గ్రంథాల సంస్థ చైర్మన్ డాక్టర్ హఫీజ్‌ఖాన్, జిల్లా ప్రధాన కార్యదర్శి హఫీజ్ పుర్కాన్, ముఫ్తీ రియాజ్, మౌలానా జుబేర్, మౌలానా హుస్సేన్, మౌలానా అక్బర్‌ఖాన్, మౌలానా సమీ, ముఫ్తీ ఉమర్, హాషిజ్ హబీబ్, మౌలానా ఫిరాసతుల్లా, ఫైసల్, ముఫ్తీ గయాస్, హాఫిజ్ షంషుద్దీన్, ముఫ్తీ కలీమ్, మౌలానా అతా ఉర్ రహ్మాన్, మౌలానా షారూఖ్, జానీ, బాబా పాల్గొన్నారు.
జమియత్ ఉలెమా రాష్ట్ర అధ్యక్షుడు
ఎహసానుద్దీన్ ఖాస్మీ రషాదీ


