మృత్యుపాశమైన విద్యుత్‌ తీగలు | - | Sakshi
Sakshi News home page

మృత్యుపాశమైన విద్యుత్‌ తీగలు

Aug 7 2026 4:05 AM | Updated on Aug 7 2026 4:05 AM

మఠంపల్లి: విద్యుత్‌ తీగలే మృత్యుపాశమయ్యాయి. పొలంలో వేలాడుతున్న విద్యుత్‌ తీగల ఫొటో తీసేందుకుగాను ఓ విద్యార్థి చేయి చాపడంతో విద్యుత్‌షాక్‌ తగిలి అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ఘటన మఠంపల్లి మండలంలోని రామచంద్రాపురంతండాలో గురువారం చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రామచంద్రాపురంతండాకు చెందిన మాలోతు మణికంఠ (19) ప్రైవేట్‌ కళాశాలలో ఇంటర్మీడియట్‌ చదువుతున్నాడు. కొద్దికాలం క్రితమే విద్యార్థి తండ్రి కేవ్లానాయక్‌ మృతి చెందడంతో తల్లి సంరక్షణలో ఉంటున్నాడు. ప్రస్తుతం వ్యవసాయ పనులు జరుగుతుండటంతో పొలం వద్దకు వచ్చి తల్లికి చేదోడువాదోడుగా ఉంటున్నాడు. ఈ క్రమంలో గురువారం పొలం పనులు చేస్తుండగా.. పొలాల్లో కిందికి వేలాడుతున్న 11 కేవీ విద్యుత్‌ తీగలను ఫొటో తీసి అధికారులకు పంపించి ఫిర్యాదు చేద్దామని గ్రామానికి చెందిన ఓ వ్యక్తి మణికంఠకు చెప్పాడు. అతడి కోరిక మేరకు మణికంఠ అక్కడే ఉన్న ట్రాక్టర్‌ ఇంజిన్‌ పైకి ఎక్కి, చేతిని విద్యుత్‌ తీగలకు దగ్గరగా పెట్టాడు. షార్ట్‌సర్క్యూట్‌ కావడంతో మణికంఠ అక్కడికక్కడే మృతి చెందాడు.

ఉద్రిక్తత.. పోలీసుల జోక్యం

రైతులు గమనించి కేకలు వేయడంతో గ్రామస్తులు అక్కడకు చేరుకున్నారు. ఫొటో తీయమని మణికంఠను ప్రేరేపించిన వ్యక్తిపై దాడికి దిగడంతో గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. సీఐ చరమందరాజు ఆధ్వర్యంలో మఠంపల్లి, పాలకీడు ఎస్‌ఐలు ప్రవీణ్‌కుమార్‌, కోటేష్‌ తన సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గ్రామస్తులకు నచ్చజెప్పి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ ప్రవీణ్‌కుమార్‌ తెలిపారు.

కిందకు వేలాడుతున్న విద్యుత్‌ తీగల ఫొటో తీసేందుకు ట్రాక్టర్‌ ఇంజిన్‌ ఎక్కిన విద్యార్థి

తీగలకు చేయి తాకడంతో

విద్యుత్‌షాక్‌తో అక్కడికక్కడే మృతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement