నాకొడుకును అన్యాయంగా హత్యకేసులో ఇరికించారు
మోత్కూరు, అడ్డగూడూరు : అడ్డగూడూరు మండలం అజీంపేట గ్రామంలో జరిగిన ఓ హత్యకేసులో అప్పటి సర్పంచ్ పోలబోయిన లింగయ్యకు సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. 2017 దసరా పండుగ రోజున ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన బట్ట లింగయ్య హత్యకు గురయ్యారు. దీంతో మొత్తం 18 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. జిల్లా కోర్టు వీరికి యావజ్జీవ శిక్ష విధించింది. విచారణలోనే జక్కుల భిక్షమయ్య అనే వ్యక్తి మృతి చెందగా మిగతా 17 మంది సికింద్రాబాద్, చర్లపల్లి జైలులో యావజ్జీవ శిక్ష అనుభవిస్తున్నారు. వీరిలో పండుగ రామస్వామి, పండుగ సాయిలు, పండుగ రాములు, పండుగ మల్లేష్, బండగొర్ల వలరాజు, పండుగ యాదయ్య, జక్కుల రమేష్, పండుగ నర్సయ్య, పండుగ సత్యనారాయణ, బండగొర్ల నాగమ్మ, పండుగ శ్రీను, పండుగ మల్లయ్య, పండుగ లింగయ్య, జక్కుల లచ్చయ్య, పోలబోయిన లింగయ్య, పండుగ నర్సింహ, పండుగ సతీష్, పండుగ శ్రీకాంత్ ఉన్నారు.
దాడి చేసినట్లు ఫిర్యాదులో లేకపోవడంతో..
పండుగ లచ్చయ్య అనే వ్యక్తి కుమార్తె వివాహం కోసం కొద్ది రోజులు బెయిల్ మంజూరు పొంది వివాహ అనంతరం జైలుకు వెళ్లాడు. పండుగ సత్యనారాయణ తన భార్య అనారోగ్యం బారిన పడడంతో నెల రోజులు బెయిల్ పొంది ప్రస్తుతం గ్రామంలో కుటుంబంతో కలిసి ఉన్నారు. ఇలా కొంత మంది కొద్ది రోజులు బెయిల్ మంజూరు పొంది కుటుంబంతో గడిపి తదుపరి జైలుకు వెళ్తున్నారు. అయితే నేరం జరిగిన సమయంలో పోలబోయిన లింగయ్య ప్రత్యక్షంగా దాడి చేసినట్లు ఫిర్యాదులో లేకపోవడంతో సుప్రీం కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది.
మా గ్రామంలో జరిగిన హత్య కేసులో నా కుమారుడు మాజీ సర్పంచ్ లింగయ్యకు సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేయడం సంతోషంగా ఉంది. గ్రామంలో ఉన్న కక్షలతో అప్పుడు సర్పంచ్‌గా ఉన్న నా కుమారుడిని అక్రమంగా కేసులో ఇరికించి జైలు పాలు చేశారు. ఇంతకాలం అన్యాయంగా జైలు శిక్ష అనుభవించాడు. నా కొడుకు నిర్దోషిగా కేసు నుంచి బయట పడతాడు.
– పోలబోయిన యాదమ్మ,
మాజీ సర్పంచ్ లింగయ్య తల్లి


