మరిపెడ రూరల్: ఒడిశా నుంచి నల్లగొండ జిల్లాకు గంజాయి తరలిస్తున్న ఐదుగురు యువకులను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి రూ.1.12 లక్షల విలువైన గంజాయితో పాటు కారు, నాలుగు సెల్‌ఫోన్లు, రూ.1,500 నగదు స్వాధీనం చేసుకున్నట్లు మరిపెడ సీఐ పవన్ కుమార్ తెలిపారు. బుధవారం సాయంత్రం మరిపెడ ఎస్సై సతీశ్, సిబ్బంది రవీందర్, రమేశ్, వెంకన్న, మహిళా కానిస్టేబుల్ శాంత మండలంలోని పురుషోత్తమాయగూడెం బ్రిడ్జి వద్ద వాహన తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ సమయంలో వేగంగా వచ్చిన ఓ కారును పోలీసులు ఆపేందుకు ప్రయత్నించగా, అందులో ఉన్న వారు తప్పించుకోవడానికి యత్నించారు. అప్రమత్తమై పోలీసులు కారును నిలిపి తనిఖీ చేశారు. అందులో డ్రైవర్ సీటు కింద 2 కిలోల 240 గ్రాముల గంజాయి లభించింది. కారులో ఉన్న నల్లగొండ జిల్లా కనగల్ గ్రామానికి చెందిన గండికోట వంశీ, చిత్రం రాకేశ్, చింతల తిరుమలేశ్, కంచి మహేశ్, మాదాసు మహేశ్‌ను అదుపులోకి తీసుకుని విచారించారు. సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో నల్లగొండలో సెల్ఫ్ డ్రైవ్‌కు కారును అద్దెకు తీసుకుని ఒడిశాకు వెళ్లి గంజాయి కొనుగోలు చేసి నల్లగొండలో విక్రయించేందుకు వస్తున్నట్లు నిందితులు అంగీకరించారు. దీంతో వారిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ తెలిపారు.
2.24 కిలోల గంజాయి, కారు, నాలుగు సెల్‌ఫోన్లు స్వాధీనం
వివరాలు వెల్లడించిన మరిపెడ సీఐ


