అర్వపల్లి : జాజిరెడ్డిగూడెం మండలం కాసర్లపహడ్ జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల భౌతిక శాస్త్ర ఉపాధ్యాయుడు చల్లా వెంకటేశ్వర్లు ప్లాస్టిక్, పేపర్ ప్లేట్‌లలో తినవద్దని, ప్లాస్టిక్, పేపర్ గ్లాసులలో టీ, నీళ్లు తాగవద్దని నిర్ణయించుకున్నారు. ఉపాధ్యాయుల శిక్షణ, ఫంక్షన్‌లు, సభలు, సమావేశాలకు ఎటు వెళ్లినా తన వెంట మట్టిపాత్ర లేదా స్టీల్ పళ్లెం, స్టీల్ గ్లాస్‌తో వెళతారు. ఇటీవల ఉపాధ్యాయుల శిక్షణకు సూర్యాపేట మండలం కుడకుడ జడ్పీహెచ్‌ఎస్‌కు వెళ్లారు. అక్కడ పేపర్ ప్లేట్‌లలో భోజనం పెడుతుండగా తన వెంట తీసుకెళ్లిన మట్టిపాత్రలో భోజనం చేసి స్టీల్ గ్లాస్‌లో నీటిని తాగారు. దీంతో అక్కడకు శిక్షణకు వచ్చిన ఉపాధ్యాయులంతా వెంకటేశ్వర్లు వైపే ఆసక్తిగా చూశారు. తాను ఆచరించటంతో పాటు పాఠశాలలో విద్యార్థులను కూడా ప్లాస్టిక్, పేపర్ ప్లేట్‌లు, గ్లాసులకు వ్యతిరేకంగా అవగాహన కల్పిస్తూ వారిని కూడా మార్చడానికి ప్రయత్నిస్తున్నారు ఉపాధ్యాయుడు వెంకటేశ్వర్లు.


