భువనగిరిటౌన్ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను తక్షణమే భర్తీ చేయాలనే డిమాండ్‌తో ఈ నెల 15న హైదరాబాద్ ఇందిరాపార్కు వద్ద సీపీఎం ఆధ్వర్యంలో చేపట్టనున్న మహాధర్నాకు నిరుద్యోగ యువత తరలి వచ్చి జయప్రదం చేయాలని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి ఎండీ జహంగీర్ పిలుపునిచ్చారు. భువనగిరి జిల్లా కేంద్రంలోని సీపీఎం కార్యాలయంలో శనివారం ధర్నాకు సంబంధించిన పోస్టర్ ఆవిష్కరించి మాట్లాడారు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలిస్తామన్న మోదీ హామీ 12 ఏళ్లయినా నెరవేరలేదన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలంటూ యూత్ డిక్లరేషన్ ఇచ్చి నిరుద్యోగులను వంచించిందని విమర్శించారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు కొండమడుగు నరసింహ, బట్టుపల్లి అనురాధ, మాటూరి బాలరాజు, దయ్యాల నరసింహ, పల్లెర్ల అంజయ్య, ఈర్లపల్లి ముత్యాలు, అన్నంపట్ల కృష్ణ, ఎదునూరి మల్లేశం పాల్గొన్నారు.


