భువనగిరి : పిల్లల ఆరోగ్యవంతంగా ఉండాలంటే మంచి ఆహారం తీసుకోవడంతో పాటు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి. శుభ్రత పాటించకపోవడం వల్ల పిల్లలు రోగాల బారిన పడతారు. అపరిశుభ్రత కారణంగా కడుపులో నులిపురుగులు తయారవుతాయి. మల, మూత్ర విసర్జణ చేసిన తర్వాత చేతులు శుభ్రంగా కడుక్కోవ పోవడం వల్ల ఇలా జరుగుతుంది. నులిపురుగుల బారిన పడిన పిల్లల్లో అనారోగ్య సమస్యలు తలెత్తి శారీరక, మానసిక ఎదుగుదలపై ప్రభావం చూపుతుంది. పిల్లలు నులిపురుగుల బారిన పడకుండా వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో జాతీయ నులిపురుగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏటా 1 నుంచి 19 ఏళ్లలోపు వయస్సు కలిగిన వారందరికీ ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేస్తోంది. ఇందులో భాగంగా ఈ నెల 13న ముందుగా గుర్తించిన సెంటర్ల వద్ద పిల్లలకు రెండు విడతలుగా మాత్రలు అందించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
1,51,040 మంది పిల్లలకు పంపిణీ
జిల్లా వ్యాప్తంగా విద్యా, సీ్త్ర శిశు సంక్షేమ శాఖల సమన్వయంతో మాత్రల పంపిణీ ఏర్పాట్లు చేశారు. జిల్లాలో 901 అంగన్‌వాడీ కేంద్రాలు, 665 ప్రభుత్వ పాఠశాలలు, 37 ఎయిడెడ్ పాఠశాలలు, 11 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో కేంద్రాలు ఏర్పాటు చేశారు. వీటితో పాటు 150 ప్రైవేటు పాఠశాలలు, 21 ప్రైవేటు కళాశాలల్లోనూ ఏర్పాట్లు చేశారు. ఆయా విద్యా సంస్థలలో మొత్తం 1,51,040 మంది పిల్లలకు మాత్రలను పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అత్యధికంగా తంగడపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో 20,186, తర్వాత భువనగిరి అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో 20,047, బీబీనగర్ పీహెచ్‌సీ పరిధిలో 10,624, అతి తక్కువగా వెల్వర్తి పీహెచ్‌సీ పరిధిలో 591 మంది పిల్లలు ఉన్నారు.
మాత్రలు ఇలా వేయాలి
1 నుంచి 2 సంవత్సరాలలోపు వయస్సు గల పిల్లలకు సగం, అల్బెండజోల్ మాత్రను, రెండు నుంచి మూడేళ్ల లోపు వారికి ఒక మాత్రను క్రష్ చేసి, మూడేళ్ల నుంచి 19 ఏళ్ల పిల్లలకుఒక మాత్రను చంపరించి, నమిలి మింగాలి. మాత్రల పంపిణీకి 1,555 మంది సిబ్బందిని నియమించారు. ఇందులో 874 మంది అంగన్‌వాడీ టీచర్లు, 681 మంది ఆశా కార్యకర్తలు ఉన్నారు. వీరు ప్రతి ఇంటిని, పాఠశాలను సందర్శించి మాత్రలు పంపిణీ చేస్తారు.
ఫ పిల్లల ఆరోగ్యానికి ఆల్బెండ జోల్ మాత్రలు
ఫ 1 నుంచి 19ఏళ్లలోపు వయస్సు గలవారికి రేపు పంపిణీ


