జాతీయ కమిటీలో ఇంద్రపాలనగరం వాసి | - | Sakshi
Sakshi News home page

జాతీయ కమిటీలో ఇంద్రపాలనగరం వాసి

Jul 12 2026 6:53 PM | Updated on Jul 12 2026 6:53 PM

రామన్నపేట : ఆర్‌జీఎన్‌ మానవ హక్కులు మరియు అవినీతి నిరో ధక సంస్థ జాతీయ కమిటీలో రామన్నపేట మండలం ఇంద్రపాలనగరం వాసి చిన్నపాక శ్రీనివాసులుకు చోటు దక్కింది. సామాజిక కార్యకర్త అయిన చిన్నపాక శ్రీనివాసులు సంస్థ బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్‌ మరియు నేషనల్‌ అడ్మినిస్ట్రేటివ్‌ సెక్రటరీగా నియమితులయ్యారు. ఈ మేరకు శనివారం సంస్థ జాతీయ అధ్యక్షుడు దేవానంద నాయుడు, సెక్రటరీ భూక్యా శ్రీని వాస్‌, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ షేక్‌ వలీపాష, ఇన్‌చార్జి మహేష్‌గుప్త హైదరాబాద్‌లో శ్రీనివాసులుకు నియామక పత్రం అందజేశారు.

లారీ, కారు ఢీ.. ఒకరు మృతి

మరో ఇద్దరికి గాయాలు

పెద్దవూర : కారు, లారీ ఎదురెదురుగా ఢీకొనడంతో వ్యక్తి మృతి చెందాడు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. ఈ ఘటన శనివారం సాయంత్రం పెద్దవూర మండల పరిధిలో చోటు చేసుకుంది. దేవరకొండ పట్టణానికి చెందిన శ్రీరామదాసు(40) మరో ఇద్దరితో కలిసి కారులో ఫంక్షన్‌కు వెళ్లారు. తిరుగు ప్రయాణంలో వీరు ప్రయాణిస్తున్న కారు పెద్దవూర మండలంలోని లింగంపల్లి గ్రామ సమీపంలోకి రాగానే దేవరకొండ నుంచి హాలియా వైపు వస్తున్న లారీ ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కారు వెనక సీటులో కూర్చున్న శ్రీరామదాసుకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. కారు డ్రైవర్‌ ముత్యాలు, మరో వ్యక్తి ప్రవీణ్‌కు గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం, శ్రీరామదాసు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నాగార్జునసాగర్‌ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ గోపాల్‌రావు తెలిపారు.

చండూరు ఎస్‌ఐని

సస్పెండ్‌ చేయాలి

పోలీస్‌ స్టేషన్‌ వద్ద బాధితుల ధర్నా

చండూరు : గత కొన్ని నెలలుగా చండూరు ఎస్‌ఐ శివకుమార్‌ తమను తీవ్రంగా వేధిస్తున్నాడని చండూరు మున్సిపాలిటీకి చెందిన కొందరు బాధితులు శనివారం పోలీస్‌ స్టేషన్‌ ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా బాధితుడు మొగుదాల రవి మాట్లాడుతూ.. మార్చి నెలలో కొందరు యువకుల మధ్య గొడవ జరగగా, ఎస్‌ఐ శివకుమార్‌ ఏకపక్షంగా తమపై కేసులు నమోదు చేసి జైలుకు పంపారని ఆరోపించారు. కేవలం ఒక సామాజిక వర్గమే టార్గెట్‌గా ఎస్‌ఐ కేసు నమోదు చేశారని, ఆ కేసులో తాను జైలుకు వెళ్లి బెయిల్‌పై వచ్చి ఆరోగ్యం బాగోలేక హైదరాబాద్‌లో ఉంటున్నానని రవి తెలిపారు. తాను ఏపీ రాజకీయాలకు సంబంధించిన ఓ వీడియోను వాట్సాప్‌ స్టేటస్‌గా పెట్టుకున్నానన్న కారణంగా గత 10 రోజలుగా తన ఇంటికి ఎస్‌ఐ పోలీసులను పంపుతూ, రౌడీషీట్‌ ఓపెన్‌ చేస్తానని బెదిరిస్తున్నాడని వాపోయాడు. తనకు తెలిసిన నాయకులతో డీఎస్పీ శివరాంరెడ్డిని కలిస్తే ఆయన ఫోన్‌లో ఎస్‌ఐని మందలించారని, అప్పటి నుంచి ఇంకా తనపై పగ పెంచుకుని స్టేషన్‌కు రావాలని వేధిస్తున్నాడని వివరించాడు. శనివారం ఉదయం ఇద్దరు నాయకులను తీసుకుని పోలీస్‌ స్టేషన్‌కి వెళ్తే ఎస్‌ఐ తమను దుర్భాషలాడాడని, దీంతో విసుగుచెంది పోలీస్‌ స్టేషన్‌ ఎదుట ధర్నాకు దిగామని తెలిపారు. ఎస్‌ఐ శివకుమార్‌ సివిల్‌ తగాదాల్లో తలదూరుస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నాడని కాంగ్రెస్‌ పార్టీ మాజీ మండలాధ్యక్షుడు కోడి గిరిబాబు ఆరోపించారు. ఉన్నతాధికారులు విచారణ జరిపి ఎస్‌ఐని సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement