ఫ మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు
యాదగిరిగుట్ట : వైటీడీ పాలకమండలిలో ఉమ్మడి జిల్లా వాసులకు స్థానం కల్పించకపోవడం విచారకరమని మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. శనివారం ఆయన ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్యతో కలిసి యాదగిరీశుడిని సందర్శించుకున్నారు. అనంతరం కొండకు దిగువన ఉన్న సన్నిధి హోటల్‌లో విలేకరులతో మాట్లాడారు. స్థానిక ఎమ్మెల్యేకు సమాచారం ఇవ్వకుండా పాలకమండలి నియామకం జరిగినట్లు తెలుస్తుందన్నారు. ఎమ్మెల్యేకు తెలిస్తే ఆలేరు నియోజకవర్గం, నల్లగొండ జిల్లాకు సంబంధించిన వారి పేర్లు ఉండేవన్నారు. రాబోయే రోజుల్లో ప్రజలే బుద్ధి చెబుతారన్నారు. రాష్ట్రంలో రాజకీయంగా మాదిగలను అణచివేసేందుకు ప్రయత్నం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో మాదిగలు, బలడుగు, బలహీన వర్గాలదే రాజ్యం అని పేర్కొన్నారు. మాదిగ మహాశక్తి ఆధ్వర్యంలో మాదిగలను ఒకటి చేసే విధంగా బీసీ పొలిటికల్ ఫ్రంట్‌తో కలిసి పర్యటనలు చేస్తున్నామన్నారు. ఏ రాజకీయ పార్టీలోనూ పనిచేసే అవసరం తనకు లేదని ఆయన పేర్కొన్నారు. మాదిగ జాతితో పాటు రాజకీయంగా అణచివేయబడిన బడుగు, బలహీన వర్గాలను కలుపుకొని పోరాటం చేస్తున్నామన్నారు.


