రామన్నపేట : బోరు మోటారు వద్ద పైపు సరిచేస్తుండగా కరెంట్ తీగ తగిలి విద్యుతాఘాతంతో రైతు మృతి చెందాడు. ఈ ఘటన రామన్నపేట మండలం కుంకుడుపాముల గ్రామంలో శని వారం జరిగింది. పోలీ సులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. కుంకుడుపాముల గ్రామానికి చెందిన గొలుసుల వెంకన్న(38) శనివారం ఉదయం గ్రామ శివారులోని తన పొలంలో నాట్లు వేసేందుకు కూలీలతో కలిసి వెళ్లాడు. బోరు సమీపంలో ఊడిపోయిన పైపును సరిచేస్తుండగా కరెంట్ తీగ తగిలి విద్యుదాఘాతానికి గురై కేకలు వేస్తూ కిందపడిపోయాడు. కేకలు విన్న కూలీలు పరుగెత్తుకుంటూ వెళ్లి చూసేసరికి వెంకన్న మృతిచెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. మృతుడి భార్య శైలజ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ సతీష్ తెలిపారు. వెంకన్న మృతదేహానికి నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించారు. వెంకన్న కుటుంబానికి ప్రభుత్వం ఆర్థికసాయం అందజేసి ఆదుకోవాలని కోరారు.


