ఖాకీలకు ఇసుక సెగ | - | Sakshi
Sakshi News home page

ఖాకీలకు ఇసుక సెగ

Jul 7 2026 2:13 AM | Updated on Jul 7 2026 2:13 AM

150 రోజుల పాటు స్పెషల్‌ డ్రైవ్‌

సాక్షి, యాదాద్రి: ఇసుక మాఫియా ఆగడాలకు చెక్‌ పెట్టేందుకు పోలీస్‌ ఉన్నతాధికారులు సిద్ధమయ్యారు. ఇటీవల ఆలేరు పోలీస్‌ స్టేషన్‌లో చోటుచేసుకున్న ‘ఇసుక పంచాయితీ’ రాష్ట్ర డీజీపీ దృష్టికి చేరడంతో అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపాలని కిందిస్థాయి అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఎక్కడైనా అక్రమ ఇసుక, ఫిల్టర్‌ ఇసుక వాహనాలు పట్టుబడితే స్థానిక ఎస్‌ఐలదే పూర్తి బాధ్యత అని హెచ్చరిస్తూ అంతర్గత మెమోలు జారీ చేశారు. పోలీసుల కళ్లుగప్పి దందా సాగితే ఏకంగా ఏఆర్‌ హెడ్‌క్వార్టర్స్‌కు అటాచ్‌ చేస్తామని గట్టి సంకేతాలు పంపుతూ.. అక్రమ రవాణా నివారణకు 150 రోజుల పాటు స్పెషల్‌ డ్రైవ్‌కు శ్రీకారం చుట్టారు.

జిల్లా అధికారుల నుంచి డీజీపీ స్థాయి వరకు..

ఆలేరు పోలీస్‌ స్టేషన్‌లో గత నెలలో జరిగిన ఇసుక ట్రాక్టర్ల వివాదం రాష్ట్ర పోలీస్‌ బాస్‌ దృష్టికి వెళ్లినట్లు సమాచారం. అధికార పార్టీ నాయకుడు, పోలీస్‌ కానిస్టేబుళ్ల మధ్య జరిగిన వాగ్వాదం వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ కాగా, పత్రికల్లో వార్తలు వచ్చాయి. ఈ విషయం జిల్లా అధికారుల నుంచి డీజీపీ స్థాయి వరకు వెళ్లింది. అధికార పార్టీ ప్రతినిధి, పోలీసుల మధ్య జరిగిన వివాదాన్ని సున్నితమైన అంశంగా భావించిన పోలీస్‌ శాఖ.. ఘటనపై శాఖాపరమైన చర్యలు ప్రారంభించింది. అయితే, అసలు గొడవకు కారణమైన ఇసుక అక్రమ రవాణా అంశాన్ని డీజీపీ సీరియస్‌గా పరిగణించినట్లు సమాచారం. ఇసుక అక్రమంగా తరలిపోతుంటే స్థానిక పోలీస్‌ శాఖ ఉదాసీనంగా ఎందుకు ఉందని ఉన్నతాధికారులు ప్రశ్నించినట్లు తెలిసింది.

అక్రమ రవాణాపై ఉక్కుపాదం

పోలీస్‌ సిబ్బంది ఇసుక మాఫియాతో కుమ్మకై ్క వాహనాలను వదిలేస్తున్నారనే ఫిర్యాదులపై ఉన్నతాధికారులు తీవ్రంగా స్పందించారు. ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపాలని జిల్లా పోలీస్‌ యంత్రాంగానికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. దీంతో జిల్లా వ్యాప్తంగా ఇసుక అక్రమ రవాణాపై నిరంతర నిఘా పెంచి నిరోధించాలని ఆదేశాలు అందడంతో పోలీస్‌ అధికారులు అప్రమత్తమయ్యారు. కిందిస్థాయి సిబ్బందిని హెచ్చరిస్తూ యాదగిరిగుట్ట సబ్‌డివిజన్‌ పరిధిలో ఎస్‌ఐలకు అంతర్గత మెమోలు జారీ చేసినట్లు సమాచారం.

అలసత్వం వహిస్తే ఏఆర్‌ హెడ్‌క్వార్టర్స్‌కే..

జిల్లాలో ప్రధానంగా ఆలేరు డివిజన్‌ వ్యాప్తంగా ఇసుక, ఫిల్టర్‌ ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలని, క్షేత్రస్థాయిలో నిరంతరం నిఘా ఉంచాలని ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. ఎక్కడైనా ఫిల్టర్‌ ఇసుక క్వారీలు లేదా అక్రమ రవాణా జరుగుతున్నట్లు తేలితే సంబంధిత పోలీస్‌ స్టేషన్‌ ఎస్‌ఐలదే బాధ్యత అని హెచ్చరించారు. అక్రమ రవాణా వాహనాలను ప్రజలు పట్టుకున్న తర్వాత పోలీసులు స్పందిస్తే సహించేది లేదని, ఎవరిౖపైనెనా ఆరోపణలు రుజువైతే ఏకంగా ఏఆర్‌ హెడ్‌క్వార్టర్స్‌కు రిపోర్ట్‌ చేస్తామని ఎస్‌ఐలకు గట్టి హెచ్చరికలు అందాయి. ఉన్నతాధికారుల తనిఖీల సమయంలో ఎవరైనా ఇసుక దందాతో దొరికితే వారిపై కఠినంగా రిపోర్ట్‌ ఫైల్‌ చేస్తామని సంకేతాలు పంపారు.

జిల్లాలోని ఆలేరు, బిక్కేరు, మూసీ, చిన్నేరు వాగుల నుంచి ఇసుకతో పాటు, ఫిల్టర్‌ ఇసుక రవాణా పెరిగిందని పోలీస్‌ ఉన్నతాధికారులకు ప్రజల నుంచి పలు ఫిర్యాదులు అందుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎలాంటి అనుమతులు లేకుండా జరిగే ఇసుక, ఫిల్టర్‌ ఇసుక రవాణాను అడ్డుకునేందుకు 100 నుంచి 150 రోజుల పాటు స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. కాగా.. ఇందిరమ్మ ఇళ్లు, ప్రభుత్వ అవసరాలు, స్థానిక అవసరాల నిమిత్తం ఇసుక రవాణాకు రెవెన్యూ శాఖ ఇచ్చిన అనుమతులు ఉన్న వాహనాలను మాత్రం అడ్డుకోవద్దని స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి.

ఫ డీజీపీ దృష్టికి ఆలేరు ఇసుక పంచాయితీ

ఫ అప్రమత్తమైన పోలీస్‌ అధికారులు

ఫ ఇసుక అక్రమ రవాణాపై నిరంతర నిఘాకు ఆదేశం

ఫ కొందరు ఎస్‌ఐలకు అంతర్గత నోటీసులు

ఫ ఇందిరమ్మ ఇళ్ల ఇసుక రవాణాకు మినహాయింపు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement