విద్యుత్‌ శాఖలో డిజిటల్‌ హాజరు | - | Sakshi
Sakshi News home page

విద్యుత్‌ శాఖలో డిజిటల్‌ హాజరు

Jul 7 2026 2:13 AM | Updated on Jul 7 2026 2:13 AM

పారదర్శకత కోసమే..

జిల్లాలో విద్యుత్‌ ఉద్యోగుల వివరాలు ఇలా..

ఆలేరురూరల్‌ : విద్యుత్‌ శాఖ అధికారులకు డిజిటల్‌ హాజరు విధానం త్వరలో అమలు కానుంది. ఇందుకు సంబంధించిన విధివిధానాలపై ఉన్నతాధికారులు కసరత్తు చేస్తున్నారు. జేఎల్‌ఎం స్థాయి ఉద్యోగి నుంచి ఎస్‌ఈ వరకు అందరికీ డిజిటల్‌ హాజరు విధానాన్ని త్వరలోనే ప్రవేశపెట్టనున్నారు. విధులకు హాజరు కాకుండానే పూర్తిస్థాయి వేతనాలు పొందుతున్నారనే విమర్శల నేపథ్యంలో ఉన్నతాధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లావ్యాప్తంగా వివిధ విభాగాల్లో పనిచేస్తున్న 638 మంది విద్యుత్‌ ఉద్యోగులకు ఈ కొత్త నియమం వర్తించనుంది. మొదటగా డివిజన్‌, జిల్లా కేంద్రాల్లో ఈ విధానాన్ని ప్రవేశపెట్టి.. రెండో విడతలో గ్రామాలకు విస్తరించేందుకు అధికారులు కసరత్తు వేగవంతం చేశారు.

రోజుకు రెండుమార్లు హాజరు..

లేదంటే సెలవే!

కొత్త విధానం ప్రకారం ఉద్యోగులు తమ వ్యక్తిగత స్మార్ట్‌ ఫోన్లలో ఎస్సీపీడీసీఎల్‌ ఎంప్లాయి పోర్టల్‌ నుంచి ప్రత్యేక యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందులో ఉద్యోగి ఐడీ, హోదా, వారు పనిచేసే లొకేషన్‌ వివరాలు నమోదవుతాయి. ఉదాహరణకు ఒక లైన్‌మెన్‌ తాను పనిచేసే పరిధిలో ఉదయం 10 గంటలలోపు మొదటిసారి, తిరిగి సాయంత్రం 6 గంటలకు రెండోసారి యాప్‌ ద్వారా హాజరు వేయాల్సి ఉంటుంది. రోజులో ఈ రెండుమార్లలో ఏ ఒక్కసారి హాజరు నమోదు చేయకపోయినా.. ఆ రోజును సెలవుగానే పరిగణిస్తారు. ఆలస్యంగా వచ్చినా ఆ రోజుకు వేతనం కోత పడే అవకాశం ఉంది.

‘అప్‌ అండ్‌ డౌన్‌’అధికారులకు బ్రేక్‌

యాదాద్రి జిల్లాలోని ఆలేరు, భువనగిరి, చౌటుప్పల్‌, యాదగిరిగుట్ట, మోత్కూర్‌, గుండాల తదితర మండలాల్లో పనిచేస్తున్న కొందరు అధికారులు పక్క జిల్లాల నుంచి, హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల నుంచి ప్రతిరోజూ అప్‌ అండ్‌ డౌన్‌ చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. దీనివల్ల వారు సకాలంలో విధులకు హాజరు కావడం లేదనే ఫిర్యాదులు వస్తున్నాయి. అయితే, క్షేత్రస్థాయిలోని కిందిస్థాయి సిబ్బంది మాత్రం గ్రామాల్లో అందుబాటులోనే ఉంటున్నారు. ఈ కొత్త యాప్‌ విధానం వల్ల ఇకపై ఏ అధికారి విధుల నుంచి తప్పించుకునే వీలుండదు. యాప్‌లోనే ఉద్యోగుల వార్షిక, నెలవారీ సెలవుల వివరాలు, మిగిలిఉన్న లీవ్‌ల డేటా మొత్తం కనిపిస్తుంది.

పెరగనున్న జవాబుదారీతనం

సబ్‌ స్టేషన్లు, ఉపకేంద్రాల పరిధిలోనే డిజిటల్‌ హాజరు వేయాల్సి ఉండడంతో ఉద్యోగులు విధుల్లో ఉండేలా ఈ యాప్‌ కట్టడి చేయనుంది. దీనివల్ల గ్రామీణ ప్రాంతాల్లోని రైతులకు, సాధారణ ప్రజలకు విద్యుత్‌ సమస్యలు తలెత్తినప్పుడు సిబ్బంది ఎల్లప్పుడూ అందుబాటులో ఉండే అవకాశం కలుగుతుంది. సొంత పనులపై బయటకు వెళ్లే వీలుండదు. ఈ కొత్త విధానాన్ని కొందరు ఉద్యోగులు స్వాగతిస్తుండగా, మరికొందరు అంతర్గతంగా వ్యతిరేకిస్తున్నట్లు సమాచారం.

పారదర్శకత కోసమే డిజిటల్‌ హాజరు విధానాన్ని తీసుకొస్తున్నారు. మొదటగా డివిజన్‌, జిల్లా కేంద్రాల్లో ఏర్పాటు చేయడానికి కసరత్తు చేస్తున్నారు. రెండో దశలో గ్రామాల్లో డిజిటల్‌ హాజరు విధానాన్ని ఏర్పాటు చేస్తారు. డిజిటల్‌ హాజరు విధానం అమలులోకి వస్తే విధులకు డుమ్మా కొట్టడానికి వీలుండదు. ప్రతి ఉద్యోగి డిజిటల్‌ హాజరును పాటిచాల్సిందే. లేదంటే ఆ రోజు సెలవు కిందకి వస్తుంది.

– సురేష్‌, ట్రాన్స్‌కో ఎస్‌ఈ

ఫ ఉద్యోగులకు యాప్‌ ద్వారా

హాజరు విధానం

ఫ రోజుకు రెండుమార్లు

తప్పనిసరిగా నమోదు

ఫ యాదాద్రి జిల్లాలో

638 మంది ఉద్యోగులు

ఫ జిల్లా కేంద్రంలో మొదట అమలు

సూపరింటెండెంట్‌ ఇంజనీర్‌–1, ఎస్‌ఏఓ–1, డీఈ–5, ఏడీఈ–12, ఏఈఈ(సివిల్‌)–1, ఏఈ 34, సబ్‌ ఇంజనీర్‌–40, ఏఓ–1, ఏఏవో–4, జెఏఓ–23, సీనియర్‌ అసిస్టెంట్‌–31, జూనియర్‌ అసిస్టెంట్‌–43, ఎఫ్‌ఎం జూనియర్‌–10, ఎస్‌ఎల్‌ఐ–8, ఎల్‌ఐ–35, లైన్‌మెన్‌–159, ఏఎల్‌ఎమ్‌–119, జెఎల్‌ఎం–95, ఆఫీస్‌ సబార్డినేట్‌–16 మంది ఉద్యోగస్తులు విధులు నిర్వర్తిస్తున్నారు. ఒకటి రెండు నెలల్లో డిజిటల్‌ హాజరు విధానం అమలులోకి రావచ్చని అధికారులు భావిస్తున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement