అధికార పార్టీ కౌన్సిలర్ల మధ్య విభేదాలు | - | Sakshi
Sakshi News home page

అధికార పార్టీ కౌన్సిలర్ల మధ్య విభేదాలు

Jul 7 2026 2:13 AM | Updated on Jul 7 2026 2:13 AM

గుట్టలో అత్యవసర సమావేశం

ఆలేరు : ఆలేరు మున్సిపాలిటీలో అధికార పార్టీ కౌన్సిలర్ల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నట్టు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఐక్యంగా ఉండి పట్టణాభివృద్ధికి కృషి చేయాల్సిన ప్రజాప్రతినిధులు గెలిచిన నాలుగు నెలల్లోనే రెండు వర్గాలుగా విడిపోయారనే ప్రచారం ఊపందుకుంది. చైర్‌పర్సన్‌ , వైస్‌ చైర్మన్‌ వర్గాలుగా పార్టీ కౌన్సిలర్లు విడిపోయినట్టు ప్రచారం జరుగుతోంది. ప్రతిపక్షానికి చెందిన ఓ కౌన్సిలర్‌ కూడా ఓ వర్గానికి మద్దతివ్వడం ఆసక్తికరంగా మారింది.

బయటపడ్డ విభేదాలు..

తాజాగా ఆలేరు పట్టణంలో చైర్‌పర్సన్‌, వైస్‌ చైర్మన్‌ వర్గీయులు, పలువురు కౌన్సిలర్లు, ఇరువురు మహిళా కౌన్సిలర్ల భర్తల మధ్య బహిరంగంగా వాగ్వాదాలు చోటుచేసుకోవడం, పరస్పరం దూషించుకోవడం ..పరిస్థితి కొట్టుకునే వరకు వెళ్లినట్టు వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

ఆర్థిక వ్యవహారాలే కారణమా?

మూడు రోజుల క్రితం ఆలేరు పట్టణంలోని ఓ ఫంక్షన్‌ హాల్‌లో ఈ ఇరువర్గాల మధ్య ఓ భూమి వివాదంపై తీవ్రవాగ్వాదాలు జరిగినట్టు తెలిసింది. మున్సిపాలిటీ పరిధిలోని పలు అంశాలకు సంబంధించి ఆర్థిక లావాదేవీలు, అభివృద్ధి పనుల నిర్వహణపై నెలకొన్న అభిప్రాయ భేదాలే ఈ వివాదాలకు కారణమని స్థానికంగా ప్రచారం జరుగుతోంది.

ఎమ్మెల్యే సీరియస్‌..

గెలిచిన మొదట్లోనే కాంగ్రెస్‌ కౌన్సిలర్ల మధ్య విభేదాలు తలెత్తాయి. చైర్‌పర్సన్‌, వైస్‌ చైర్మన్‌ల మధ్య వివాదం నెలకొనడంతో ప్రభుత్వ విప్‌ బీర్ల ఐలయ్య వారితో చర్చలు జరిపి సయోధ్య కుదిర్చారు. అంతా సర్దుకుందని ఎమ్మెల్యే భావించిన తరుణంలో మరోసారి కౌన్సిలర్ల గొడవలు బహిర్గతం కావడం పట్ల ఆయన సీరియస్‌ అయినట్టు తెలిసింది.

ఫ ఆలేరు మున్సిపాలిటీలో రచ్చకెక్కిన చైర్‌పర్సన్‌, వైస్‌ చైర్మన్‌ వర్గీయులు

ఫ భూ వివాదంలో పరస్పర దూషణలు.. వీడియోలు వైరల్‌

చైర్‌పర్సన్‌, వైస్‌ చైర్మన్‌, ఐదుగురు కాంగ్రెస్‌ కౌన్సిలర్లలో ఒకరు మినహా మిగతావారు, పట్టణ ముఖ్య నాయకులతో ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య సోమవారం యాదగిరిగుట్టలోని తన నివాసంలో అత్యవసర సమావేశం నిర్వహించినట్టు తెలిసింది. ఇరువర్గాలు వ్యవహరిస్తున్న తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. వ్యక్తిగత విభేదాలను పక్కన పెట్టి, సమష్టిగా పని చేయాలని వారికి సూచించినట్టు తెలిసింది. ఈ క్రమంలోనే ఓ మహిళా కౌన్సిలర్‌ భర్త తీరుతో ఎమ్మెల్యే తీవ్రంగా మందలించారని సమాచారం. అనవసర వివాదాలకు దూరంగా ఉండాలని, ప్రజల్లో పార్టీ ప్రతిష్ట దెబ్బతీనేలా వ్యవహరించవద్దని ఎమ్మెల్యే హెచ్చరించినట్టు సమచారం.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement