సాక్షి, యాదాద్రి : జిల్లాలో ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమాన్ని వంద శాతం విజయవంతమే లక్ష్యంగా కృషి చేస్తున్నట్లు కలెక్టర్ అనురాగ్ జయంతి పేర్కొన్నారు. ఎస్‌ఐఆర్‌పై సోమవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, ఈఆర్‌ఓలు, ఏఈఆర్‌ఓలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఇందులో కలెక్టరేట్‌లో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. జిల్లాలో ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ ప్రక్రియ పూర్తయిందని, డిజిటైజేషన్ పనులను కూడా త్వరితగతిన పూర్తి చేస్తామన్నారు. అలాగే, పోలింగ్ కేంద్రాల రేషనలైజేషన్ (పునర్వ్యవస్థీకరణ) ప్రక్రియను నిబంధనల ప్రకారం పకడ్బందీగా చేపడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకా రెడ్డి, ఆర్డీఓ కృష్ణారెడ్డి పాల్గొన్నారు.
మహా శివుడికి సంప్రదాయ పూజలు
యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయానికి అనుబంధంగా కొనసాగుతున్న శ్రీపర్వత వర్ధిని సమేత రామలింగేశ్వస్వామి వారి ఆలయంలో సోమవారం సంప్రదాయ పూజలు కొనసాగాయి. మహా శివుడికి ఇష్టమైన రోజు కావడంతో విశేషంగా అభిషేకం, బిల్వార్చన పూజలు చేశారు. ముఖ మండపంలోని శ్రీస్పటిక రామలింగేశ్వరుడికి పూజారులు బిల్వ పత్రాలతో పూజలు జరిపారు. భక్తులచే అష్టోత్తర పూజలు నిర్వహించారు. సాయంత్రం వేళ శివాలయంలో శ్రీరామలింగేశ్వర సమేత పార్వతీ దేవి సేవను ఊరేగించారు. యాదగిరీశుడి ప్రధానాలయంలో నిత్య కై ంకర్యాలను అర్చకులు సంప్రదాయంగా జరిపించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగిన ఆయా పూజల్లో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు.
క్రీడల్లోనూ రాణించాలి
నల్లగొండ టూటౌన్ : ఎంజీ యూనివర్సిటీ విద్యార్థులు విద్యతో పాటు క్రీడల్లోనూ రాణించాలని రిజిస్ట్రార్ కొప్పుల అంజిరెడ్డి అన్నారు. సోమవారం ఎంజీయూ స్పోర్ట్స్ బోర్డ్ ఆధ్వర్యంలో వ్యాయామ అధ్యాపకుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలు శారీరక, మానసిక దృఢత్వాన్ని పెంపొందించడంతో పాటు నాయకత్వ లక్షణాలు, క్రమశిక్షణ, జట్టు స్ఫూర్తిని పెంపొందిస్తాయని తెలిపారు. విద్యార్థులకు మెరుగైన క్రీడా వసతులు కల్పించడంతో పాటు జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనేందుకు అవసరమైన అన్ని విధాల సహాయ సహకారాలు అందించేందుకు తమ యూనివర్సిటీ సిద్ధంగా ఉందన్నారు. సమావేశంలో యూనివర్సిటీ స్పోర్ట్స్ బోర్డ్ కార్యదర్శి హరీష్ కుమార్, స్పోర్ట్స్ బోర్డ్ సభ్యులు, వ్యాయామ అధ్యాపకులు తదితరులుపాల్గొన్నారు.


