నార్కట్‌పల్లి: మద్రాస్ విశ్వవిద్యాలయం నిర్వహించనున్న ఉగాది వేడుకలకు నార్కట్‌పల్లి మండలంలోని నక్కలపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు, కవి, రచయిత, పుడమి సాహితీ వేదిక జాతీయ అధ్యక్షుడు చిలుముల బాల్ రెడ్డికి శుక్రవారం ఆహ్వానం వచ్చింది. శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకల సందర్భంగా ఈ నెల 18న చైన్నెలోని మద్రాస్ విశ్వవిద్యాలయం తెలుగు శాఖ ఆధ్వర్యంలో నిర్వహించనున్న మహా కవి సమ్మేళనంలో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా తెలుగు కవులు, తెలుగు వారి సాంస్కృతిక వారసత్వం, ఉగాది విశిష్టతను తమ కవితా పఠనంతో వివరించనున్నారు.
బైక్ చెట్టును ఢీకొని
వ్యక్తి మృతి
భువనగిరి: మండల పరిధిలోని పగిడిపల్లి గ్రామం వద్ద శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భువనగిరి పట్టణంలోని హన్మాన్‌వాడ్‌కు చెందిన మోతె శ్రీరాములు(38) బీబీనగర్ మండలం అన్నంపట్ల గ్రామంలో బంధువుల ఇంటికి బైక్‌పై వెళ్లాడు. సాయంత్రం తిరిగి భువనగిరికి బయలుదేరాడు. భువనగిరి మండలం పగిడిపల్లి గ్రామ సమీపంలోని రోడ్డు పక్కన ఉన్న చెట్టును అదుపుతప్పి ఢీ కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతుడి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై అనిల్‌కుమార్ తెలిపారు.
అవయవదానంతో నలుగురికి పునర్జన్మ
కేతేపల్లి: రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి బ్రెయిన్‌డెడ్ కావడంతో అతడి అవయవాలను కుటుంబసభ్యులు జీవన్‌దాన్ సంస్థకు అప్పగించారు. కేతేపల్లి మండలంలోని ఇనుపాముల గ్రామానికి చెందిన శివాలయ కమిటీ మాజీ చైర్మన్, బీఆర్‌ఎస్ నాయకుడు కంచర్ల జగన్మోహన్‌రెడ్డి(57) ఈనెల 10న బైక్‌పై నల్లగొండ నుంచి స్వగ్రామానికి వస్తుండగా మార్గమధ్యంలో తాటికల్ గ్రామం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని యశోధ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న జగన్మోహన్‌రెడ్డి బతికే అవకాశం లేదని, బ్రెయిన్ డెడ్‌గా నిర్ధారించారు. ఈమేరకు ఆయన కుటుంబ సభ్యులకు అవయవ దానం గురించి అవగాహన కల్పించారు. వైద్యుల సూచనల మేరకు జగన్మోహన్‌రెడ్డి అవయవాలను దానం చేసేందుకు కుటుంబ సభ్యులు ముందుకు వచ్చారు. విషయం తెలుసుకున్న జీవన్‌దాన్ సంస్థ ప్రతినిధులు గురువారం రాత్రి ఆస్పత్రికి చేరుకుని అవయవాలను సేకరించారు. శుక్రవారం జగన్మోహన్‌రెడ్డి మృతదేహాన్ని ఇనుపాముల గ్రామానికి తీసుకువచ్చి అంత్యక్రియలు పూర్తి చేశారు.


