ప్రతి ఇంటినీ లెక్కిస్తారు..
ఫ నిర్వహణకు గణాంక శాఖ ఏర్పాట్లు
ఫ మే నుంచి మొదటి దశ ఇళ్ల లెక్కింపు
ఫ వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జనాభా లెక్కల సేకరణ
సాక్షి, యాదాద్రి : జనగణన–2027 ప్రక్రియకు జిల్లా యంత్రాంగం సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా మొదటి దశ నిర్వహించనున్న హౌస్ హోల్డ్ సమాచారం సేకరణకు సంబంధించి జిల్లా, మండల, మున్సిపల్ స్థాయిలో సెన్సెస్ అధికారులకు ఆదివారం శిక్షణ ప్రారంభం కానుంది. ఈ శిక్షణ మూడు రోజుల పాటు కొనసాగనుంది. అయితే ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 2011లో జనాభా లెక్కలు సేకరించారు. అనంతరం 2021లో జనగణన చేపట్టాల్సిన ఉండగా కరోనా కారణంగా జరగలేదు. మళ్లీ 15 ఏళ్ల తర్వాత ప్రస్తుతం యాదాద్రి భువనగిరి జిల్లా యూనిట్‌గా జనజనణకు సన్నాహాలు చేస్తున్నారు.
ఇళ్ల సర్వేపై శిక్షణ
జనగణనలో భాగంగా ఇళ్ల లెక్కింపు సర్వేపై ఈనెల 15, 16, 17 తేదీల్లో కలెక్టరేట్‌లో శిక్షణ తరగతులు నిర్వహిస్తారు. గణాంక శాఖ రాష్ట్ర అధికారులు ఈ శిక్షణ ఇవ్వనున్నారు. మండల, మున్సిపల్ సెన్సెస్ చార్జ్ అధికారులు, మండల అడిషనల్ చార్జ్ అధికారులకు ఈ శిక్షణ ఇస్తారు. ఇందులో భాగంగా 24, 25, 26 తేదీల్లో సెన్సెస్ క్లర్క్స్‌కు శిక్షణ ఇస్తారు. ప్రతి మండలం, మున్సిపాలిటీకి ఒక్కొక్కరు చొప్పున ఉంటారు. వలిగొండ, భువనగిరి, చౌటుప్పల్ మండలాలకు ఇద్దరు, మల్టీపర్పస్‌గా ఒక్కరు చొప్పున 26 మంది క్లర్క్స్ ఉంటారు. అలాగే క్షేత్ర స్థాయిలో ఇళ్ల గణనకు ఫీల్డ్ ట్రైనీస్‌గా 26 మంది టీచర్లకు ఈనెల 28,29, 30 తేదీల్లో గణాంక శాఖ అధికారులు శిక్షణ ఇవ్వనున్నారు. అయితే ఎఫెక్ సర్వే ప్రకారం జిల్లాలో సుమారు 2.14 లక్షల ఇళ్లు ఉన్నాయి.
ప్రిన్సిపల్ సెన్సెస్ అధికారిగా కలెక్టర్..
జనగణన కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ప్రిన్సిపల్ సెన్సెస్ అధికారిగా వ్యవహరిస్తారు. జిల్లా సెన్సెస్ అధికారిగా సీపీఓ ఉంటారు. రెవెన్యూ, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌లు, ఏడుగురు అదనపు సెన్సెస్ అధికారులు ఉంటారు. ఇందులో భువనగిరి, చౌటుప్పల్ ఆర్డీవోలు, సీపీవో, డీఈవో, డీఏవో, జెడ్పీ సీఈవో, డీపీవో, డీపీఆర్‌వో, ఏడీసీవోలు ఉంటారు. మున్సిపాలిటీల్లో కమిషనర్‌లు చార్జ్ అధికారులు, మేనేజర్‌లు అదనపు చార్జ్ అధికారులు, మండలాల్లో తహసీల్దార్‌లు చార్జ్ అధికారులుగా, ఎంపీడీవోలు అదనపు చార్జ్ అధికారుగా వ్యవహరిస్తారు.
ఫిబ్రవరి–2027లో గణన
ఇళ్ల లెక్కలు తేలిన తర్వాత జనాభా లెక్కల సేకరిస్తారు. ఈ సారి జనగణన డిజిటల్ పద్ధతిలో చేపడతారు. 2011 జనాభా లెక్కలతో పోలిస్తే 20 నుంచి 30 శాతం జనాభా పెరిగే అవకాశం ఉంది.
జనగణనలో భాగంగా ప్రతి ఇంటిని లెక్కిస్తారు. మేలో ప్రారంభమై సెప్టెంబర్ 2026 వరకు గణిస్తారు. ఇంటి స్వరూపం, గదుల సంఖ్య, జీప్లస్ 1, అంతకుపైగా ఉన్న వివరాలు, ఇంటి యజమాని పేరు, కుటుంబ సభ్యులు సంఖ్య వంటి పలు అంశాలను లెక్కిస్తారు. ఇళ్ల సంఖ్య తేలిన అనంతరం జనగణన చేపడతారు. ప్రతి 700 నుంచి 800 మందికి ఒకరు చొప్పున ఎన్యుమరేటర్ ఉంటారు. ప్రతి ఆరుగురు ఎన్యుమరేటర్లకు ఒక సూపర్‌వైజర్ ఉంటారు. వీరందరిని ఇప్పటికే ఎంపిక చేశారు.
2011 జనాభా లెక్కల వివరాలు..
మొత్తం జనాభా 7,70,833
మహిళలు 3,80,341
పురుషులు 3,90,492


