గడువులోగా లక్ష్యం చేరేనా! | - | Sakshi
Sakshi News home page

గడువులోగా లక్ష్యం చేరేనా!

Mar 15 2026 5:14 AM | Updated on Mar 15 2026 5:14 AM

భూదాన్‌పోచంపల్లి : మున్సిపాలిటీల్లో 2025–26 ఆర్థిక సంవత్సరానికి గాను ఆస్తి పన్నుల వసూలుకు మరో 16 రోజులు మాత్రమే గడువు ఉంది. ఇప్పటికే చాలా మున్సిపాలిటీల్లో 50 శాతం కూడా లక్ష్యం నెరవేరలేదు. ఈనెల 31 తేదీ వరకు గడువు ఉండడంతో ఆలోపు వంద శాతం పన్ను వసూలుకు అధికారులు అన్ని మున్సిపాలిటీల్లో స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహిస్తున్నారు. సకాలంలో పన్నులు చెల్లించాలని ఇప్పటికే బకాయిదారులకు నోటీసులు జారీ చేశారు. గడువు సమీపిస్తుండడంతో వార్డు ఆఫీసర్లు, బిల్లు కలెక్టర్లు ఇంటింటా తిరిగి పన్నులు చెల్లించాలని వినియోగదారులకు సూచిస్తున్నారు. పన్నులు చెల్లింపునకు మున్సిపాలిటీల్లో ప్రత్యేక కౌంటర్ల ఏర్పాటుతో పాటు ఆన్‌లైన్‌లో కూడా చెల్లించుటకు వెలుసుబాటు కల్పించారు.

50 శాతం కూడా దరిచేరని లక్ష్యం..

జిల్లాలోని ఆరు మున్సిపాలిటీలు ఉండగా అందులో చౌటుప్పల్‌, మోత్కూరు మినహా మిగతా మున్సిపాలిటీల్లో ఆస్తి పన్లు వసూలు 50శాతం కూడా లక్ష్యానికి చేరుకోలేదు. జిల్లాలో చౌటుప్పల్‌ మొదటి స్థానంలో ఉండగా, ఆలేరు చివరిస్థానంలో నిలిచింది. ఈ నెల 13 నాటికి చౌటుప్పల్‌లో 62.88 శాతం, ఆలేరులో 37.80 శాతం పన్నులు వసూలు అయ్యాయి. ఇక తెలంగాణలో 131 మున్సిపాలిటీలు ఉండగా, పన్నుల వసూలు విషయంలో రాష్ట్రస్థాయిలో వరుసగా చౌటుప్పల్‌ 34, మోత్కూరు 65, యాదగిరిగుట్ట 76, భువనగిరి 80, భూదాన్‌పోచంపల్లి 114, ఆలేరు 115 స్థానాల్లో నిలిచాయి.

ఊరటనిచ్చిన మున్సిపల్‌ ఎన్నికలు..

గత నెలలో జరిగిన మున్సిపల్‌ ఎన్నికలు పన్నుల వసూలుకు కొంత ఊరటనిచ్చాయి. మున్సిపల్‌ ఎన్నికల్లో పోటీ చేసే కౌన్సిలర్‌ అభ్యర్థులతో పాటు వారిని బలపరిచే అభ్యర్థులు తప్పనిసరిగా ఆస్తి పన్నులు చెల్లించి నోడ్యూస్‌ సర్టిఫికెట్‌ జతపర్చాలనే నిబంధనతో అభ్యర్థులంతా ఆస్తి పన్నులు చెల్లించారు. దాంతో భువనగిరిలో రూ.20,85,000లు, చౌటుప్పల్‌లో రూ.15,89,526లు, యాదగిరిగుట్టలో రూ.14,39,000, భూదాన్‌పోచంపల్లిలో రూ.8,02,432లు, మోత్కూర్‌లోరూ.7,92,000లు, ఆలేరులో రూ. 5,69,730లు వసూలు అయ్యాయి.

ఈనెల 13 నాటికి పన్ను వసూలు వివరాలు (రూ.కోట్లలో)

మున్సిపాలిటీ గృహాలు డిమాండ్‌ వసూలు శాతం

చౌటుప్పల్‌ 8,995 8.19 5.15 62.88

మోత్కూరు 5,024 1.37 0.72 52.55

యాదగిరిగుట్ట 5223 3.80 1.85 48.68

భువనగిరి 15,321 9.37 4.44 47.39

పోచంపల్లి 5,190 2.99 1.17 39.13

ఆలేరు 4,718 2.54 0.96 37.80

ఫ మున్సిపాలిటీల్లో ఆస్తిపన్ను వసూలుకు నెలాఖరు వరకే గడువు

ఫ ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహిస్తున్న యంత్రాంగం

ఫ ఇప్పటి వరకు 40 నుంచి 60 శాతమే వసూలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement