భూదాన్‌పోచంపల్లి : పట్టు పరిశ్రమ అభివృద్ధిలో దేశంలో తెలంగాణ నాలుగో స్థానంలో ఉందని సెంట్రల్ సిల్క్ బోర్డు (మైసూర్) సీనియర్ సైంటిస్ట్ డాక్టర్ దయానంద అన్నారు. శుక్రవారం భూదాన్‌పోచంపల్లి పట్టణ కేంద్రంలో రీజినల్ సిల్క్ పరిశోధనా కేంద్రం, తెలంగాణ పట్టు పరిశ్రమ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పట్టు రైతులు, రీలర్లు, చేనేత కార్మికుల సమ్మేళనం పేరిట ఏర్పాటు చేసిన రాష్ట్రస్థాయి శ్రీపట్టు కృషి మేళా–2026శ్రీను పద్మశ్రీ అవార్డు గ్రహీత గజం గోవర్థన్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో పట్టు పరిశ్రమ అభివృద్ధిలో కర్నాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయన్నారు. ఇతర పంటలతో పోల్చితే పట్టు పరిశ్రమ ఎంతో లాభదాయకంగా ఉందని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టు పరిశ్రమను ప్రోత్సహించేందుకు 75 శాతం నుంచి 85 శాతం మేర రాయితీలు ఇస్తుందని పేర్కొన్నారు. తెలంగాణలో 7వేల మంది పట్టు రైతులు 15వేల ఎకరాల్లో పట్టు సాగు చేస్తున్నారని చెప్పారు. పద్మశ్రీ గజం అంజయ్య మాట్లాడుతూ.. అత్యంత నాణ్యమైన మల్బరీ పట్టు ఉత్పత్తి పెంచి ఆఽర్థికంగా లాభపడాలన్నారు. కాగా.. మేళాలో పట్టు ఉత్పత్తులు, మల్బరీతోటకు పిచికారీ మందులు తదితర స్టాల్స్ ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో పట్టు పరిశోధనా కేంద్రం మైసూర్ సీనియర్ శాస్త్రవేత్తలు డాక్టర్ జయషిరాణి, మల్లికార్జున, సెంట్రల్ సిల్క్ బోర్డు రీజినల్ సిల్క్ పరిశోధనా కేంద్రం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ వినోద్ కుమార్‌యాదవ్, రాష్ట్ర జాయింట్ డైరెక్టర్‌లు ఎం. లత, అనసూయ, శాస్త్రవేత్త డాక్టర్ రాఘవేంద్ర, జిల్లా చేనేత, జౌళిశాఖ ఏడీ శ్రీనివాసరావు, జిల్లా సెరికల్చర్ అధికారిణి మాధవి, శ్రీరంజన్ సిల్క్ యూనిట్ నిర్వాహకుడు ఎన్నం శివకుమార్, టైఅండ్ డై సిల్క్ చీరెల ఉత్పత్తిదారుల సంఘం అధ్యక్షుడు కర్నాటి బాలరాజు, చేనేత కార్మిక సంఘం అధ్యక్షుడు అంకం పాండు, భారత భూషణ్, రాజేశ్వరీ, చేనేత నాయకులు తదితరులు పాల్గొన్నారు.
ఫ సెంట్రల్ సిల్క్‌బోర్డు సీనియర్
శాస్త్రవేత్త డాక్టర్ దయానంద


