యాదగిరిగుట్ట: పశ్చిమాసియాలో యుద్ధప్రభావం మనప్రాంతంలో వంటగ్యాస్ సరఫరాపై పడింది. డొమెస్టిక్, కమర్షియల్ సిలిండర్ల సరఫరాలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. అప్రమత్తమైన ఏజెన్సీలు వాణిజ్య సిలిండర్ల పంపిణీ నిలిపివేశాయి. ఇక డొమెస్టిక్ సిలిండర్ల కోసం బుకింగ్ కష్టాలు తప్పడంలేదు. యాదగిరిగుట్ట పట్టణంలో సుమారు 20కి పైగా పెద్ద హోటళ్లు ఉన్నాయి. ఇందులో టిఫిన్స్ తయారు చేసేందుకు కమర్షియల్ గ్యాస్ సిలిండర్లనే ఎక్కువగా నిర్వాహకులు వినియోగిస్తున్నారు. తాజాగా హోటళ్లకు వాణిజ్య సిలిండర్ల సరఫరాను నిలివేశారు. దీంతో హోటల్ నిర్వాహకులు కట్టెల పొయ్యిపై టిఫిన్స్‌ను తయారు చేస్తున్నారు. అంతే కాకుండా పలు హోటల్స్ మూసివేసేందుకు సిద్ధమయ్యారు.
వారం రోజులుగా..
యాదగిరిగుట్టలోని హెచ్‌పీ గ్యాస్ ఏజెన్సీ నుంచి ప్రతి నెలా 250 కమర్షియల్ సిలిండర్లు హోటళ్లకు సరఫరా చేస్తున్నారు. పశ్చిమాసియాలో నెలకొన్న సంక్షోభంతో కమర్షియల్ సిలిండర్లు రాకపోవడంతో వారం రోజులుగా హోటళ్లకు గ్యాస్ సరఫరా నిలిపివేశారు. వారం రోజుల క్రితం కొనుగోలు చేసిన సిలిండర్లు ఉండటంతో కొన్ని హోటల్స్ టిఫిన్స్ తయారు చేస్తుండగా.. మరి కొన్ని హోటళ్లలో కమర్షియల్ సిలిండర్లు అయిపోయాయి. దీంతో పలువురు నిర్వాహకులు యాదగిరి క్షేత్రానికి వచ్చే భక్తులకు టిఫిన్స్, భోజనాలను అందించేందుకు కట్టెల పొయ్యిలపై టిఫిన్స్, వంటలు చేసే పరిస్థితి నెలకొంది. ఇక యాదగిరి క్షేత్రంలో లడ్డూ ప్రసాదం, అన్న ప్రసాదానికి సరిపోను సిలిండర్లు అందజేస్తున్నట్లు హెచ్‌పీ గ్యాస్ ఎజెన్సీ నిర్వాహకులు వెల్లడించారు. ఇదిలా ఉండగా.. ఇళ్లలో వాడుకునే గ్యాస్ సిలిండర్ల కొరత రాబోయే రోజుల్లో ఉంటుందనే ఆలోచనలో ప్రజలు ముందస్తుగా గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకునేందుకు హెచ్‌పీ ఎజెన్సీ కస్టమర్ కేర్‌కు కాల్స్ చేస్తుంటే నెట్‌వర్క్ బిజీ రావడంతో ఇబ్బందులు పడుతున్నారు.
ఇళ్లలో సైతం గ్యాస్ సిలిండర్ల కొరత ఏర్పడితే పరిస్థితి ఏమిటని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్యాస్ ఎజెన్సీ నిర్వాహకులు మాత్రం డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ల కొరత లేదని, ఓటీపీ వచ్చిన ప్రతి ఇంటికి గ్యాస్ సిలిండర్లు సరఫరా చేస్తున్నామని వెల్లడించారు.
యాదగిరిగుట్టలో కట్టెల పొయ్యిపై టిఫిన్స్,
వంటలు చేస్తున్న ఓ హోటల్ నిర్వాహకుడు
గుట్టలో మూతబడిన చాయ్ దుకాణం
నిలిచిన కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల సరఫరా
ఫ కట్టెల పొయ్యిపై టిఫిన్స్ తయారీ
ఫ డొమెస్టిక్ రీఫిల్ బుకింగ్ కోసం వినియోగదారుల పాట్లు


