మోత్కూరు : ప్రభుత్వ ఉద్యోగికి రావాల్సిన వేతన బిల్లులు క్లియర్ చేసేందుకు లంచం తీసుకున్న మోత్కూరు సబ్ ట్రెజరీ కార్యాలయం సీనియర్ అకౌంటెంట్‌ను గురువారం ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఏసీబీ డీఎస్పీ జగదీష్ చందర్ తెలిపిన వివరాల ప్రకారం.. మోత్కూరు మండల పంచాయతీ అధికారిగా పనిచేస్తున్న పైళ్ల జనార్దన్‌రెడ్డి 38 రోజులకు గాను తనకు రావాల్సిన రూ.1,09,386 వేతన బిల్లులు క్లియర్ చేయాలని గత నెల 5న మోత్కూరు సబ్ ట్రెజరీ కార్యాలయంలో సంప్రదించగా.. సీనియర్ అకౌంటెంట్ ఎండీ ఖదీర్ రూ.10 వేలు లంచం డిమాండ్ చేశాడు. దీంతో ఖదీర్‌తో పాటు అతడి సహచర ఉద్యోగి నిరంజన్ అకౌంట్‌కు విడతల వారీగా రూ.10 వేలు పంపించిన తర్వాతే ఆన్‌లైన్ చేసి టోకెన్ ఇచ్చారని ఈ నెల 4న కలెక్టర్‌తో పాటు ఏసీబీ అధికారులకు జనార్దన్‌రెడ్డి ఫిర్యాదు చేశాడు. దీంతో గురువారం సబ్ ట్రెజరీ కార్యాలయంపై దాడి చేసి రికార్డులను పరిశీలించినట్లు ఏసీబీ డీఎస్పీ తెలిపారు. ముందుగా భువనగిరిలోని ఖదీర్ నివాసంలో సోదాలు జరిపినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు ఖదీర్‌ను అరెస్టు చేశామని, శుక్రవారం హైదరాబాద్‌లోని నాంపల్లి ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు.
ఫ మోత్కూరు సబ్ ట్రెజరీ కార్యాలయం సీనియర్ అకౌంటెంట్ అరెస్ట్


